Telugu Gateway
Politics

కోమ‌టిరెడ్డి.. ఈటెల రాజేంద‌ర్ కాగ‌ల‌రా?!

కోమ‌టిరెడ్డి.. ఈటెల రాజేంద‌ర్ కాగ‌ల‌రా?!
X

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి మ‌రో ఈటెల రాజేంద‌ర్ కాగ‌ల‌రా?. అది జ‌రిగే ప‌నేనా?. అంటే ఇది అంత తేలికైన వ్య‌వ‌హారం కాద‌నే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు...మునుగోడు ఉప ఎన్నిక‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసాలు ఉండ‌బోబోతున్నాయి. మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ను భూక‌బ్జాలు..ఇత‌ర ఆరోప‌ణ‌ల‌తో టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత వ‌చ్చిన స‌వాళ్ల‌తో ఈటెల రాజేంద‌ర్ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసి మ‌రీ ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. బిజెపి అభ్య‌ర్ధిగా రంగంలో దిగి..అధికార పార్టీ అక్ర‌మాలు..ప్ర‌లోభాల‌ను అధిగ‌మించి మ‌రీ సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేశారు. ఇది అధికార పార్టీకి పెద్ద షాక్ నే మిగిల్చింది. టీఆర్ఎస్ పార్టీ నిర్మాణంలో ఈటెల రాజేంద‌ర్ ది కీల‌క పాత్ర అన్న విష‌యం తెలిసిందే. అదే స‌మ‌యంలో హుజూరాబాద్ తో ఆయ‌న‌కు సుదీర్ఘ అనుబంధం ఉంది. వివాద‌ర‌హితుడు...అంద‌రితో క‌ల‌సిపోయే మ‌న‌స్త‌త్వం ఈటెల రాజేందర్ ది. కానీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి విష‌యానికి వ‌స్తే రాజ‌కీయంగా చాలా తేడాలు స్ప‌ష్టంగా క‌న్పిస్తున్నాయి. ఆయ‌న గెలిచిన పార్టీని కాద‌ని..పార్టీ మారేందుకు రాజీనామా చేశారు.

కాంగ్రెస్ లో ఉండి కూడా రాష్ట్రంలో టీఆర్ఎస్ ను ఓడించేది బిజెపినే అంటూ వ్యాఖ్య‌లు చేసి..గెలిపించిన పార్టీకి వెన్నుపోటు పొడిచే ప్ర‌య‌త్నం చేశార‌నే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. అంతే కాదు..ఆయ‌న త‌న రాజీనామాకు చెబుతున్న కార‌ణం కూడా ఏ మాత్రం స‌హేతుకంగా లేదు. మునుగోడు అభివృద్ధి కోస‌మే రాజీనామా చేస్తున్న‌ట్లు ప్ర‌కటించారు. నిజంగా మునుగోడు అభివృద్ధి కోస‌మే అయితే..కాంగ్రెస్ లో ఉండి రాజీనామా చేయ‌వ‌చ్చు క‌దా అన్న ప్ర‌శ్న ఉద‌యించ‌టం స‌హ‌జం. ఉప ఎన్నిక వ‌స్తేనే సీఎం కెసీఆర్ నియోజ‌క‌వ‌ర్గానికి నిధులు వ‌స్తాయ‌న్న‌ది నిజ‌మే అయితే కాంగ్రెస్ లో ఉండి రాజీనామా చేసినా కూడా నిదులు రావాలి క‌దా?. కేవ‌లం బిజెపిలో చేరితేనే నిధులు వ‌స్తాయా.. కానీ ఆయ‌న బిజెపిలో చేరేందుకు..బిజెపి రాజ‌కీయ క్రీడ‌లో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్ర‌య‌త్నాలే ఎక్కువ‌గా క‌న్పిస్తున్నాయి. అందుకే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి రాజీనామా చేశారు అన్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. మ‌రో కామెడీ ఏమిటంటే దేశంలోనే వార‌స‌త్వ రాజ‌కీయాల‌కు కాంగ్రెస్ పార్టీ ఓ ర‌కంగా బ్రాండ్ అంబాసిడ‌ర్ అని చెప్పుకోవ‌చ్చు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొన‌సాగిన రాజ‌గోపాల్ రెడ్డి ఇప్పుడు కెసీఆర్ ఫ్యామిలీకి వ్య‌తిరేకంగా పోరాటం చేస్తాన‌ని చెబుతున్నారు. దీన్ని ప్ర‌జ‌లు న‌మ్ముతారా?. ఈ లాజిక్ వ‌ర్కవుట్ అవుతుందా అన్న‌ది తెలియాలంటే వేచిచూడాల్సిందే.

Next Story
Share it