కోకాపేట వెయ్యి కోట్ల స్కామ్ పై అమిత్ షాకు ఫిర్యాదు
జట్టు ఊడిపోతుందని గుండు కొట్టించుకంటామా?
తాగి పడుకుంటే ఎవరైనా కబ్జా చేస్తారు?
ఒకే చోట భూమి... రేట్లలో అంత తేడానా?
60 కోట్లు ధర నిర్ణయించి..స్విస్ ఛాలెంజ్ లో అమ్మకాలు జరపాలి
కోకాపేట భూముల అమ్మకాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ భూముల అమ్మకాల్లో వెయ్యి కోట్ల రూపాయల దోపిడీ సాగిందని..ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి అమిత్ షాకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఒకే చోట ఉన్న భూమి ఒక ఎకరం అరవై కోట్ల రూపాయలకు..మిగతావి 30 నుంచి 40 కోట్ల రూపాయల మధ్య ధర పలుకుతాయా అని ప్రశ్నించారు. ఈ భూములు అన్నీ రామేశ్వరరావు కమారులకు చెందిన కంపెనీలు, సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కుటుంబానికి చెందిన రాజపుష్ప సంస్థలు, మహబూబ్ నగర్ ఎంపీకి చెందిన సోదరుడి కంపెనీ, మంత్రి కెటీఆర్ తో చీకటి ఒప్పందాలు ఉన్న ప్రెస్టీజ్ సంస్థ, చైతన్య విద్యా సంస్థలకు చెందిన వాళ్లే దక్కించుకున్నారని తెలిపారు. ఇతర సంస్థలు ఏవీ టెండర్లలో పాల్గొనకుండా సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కంపెనీలను బెదిరించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.. కాదు కూడదు అని ఎవరైనా ముందుకు వస్తే..జీవో 111 కు కిలోమీటర్ దూరంలో ఉన్నాయని..ఇతర నిబంధనలు అడ్డం పెట్టి ఒక ఫ్లోర్ కు మించి అనుమతులు ఇవ్వమని హెచ్చరించారన్నారు. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు వస్తాయన్నారు.మరి ఇప్పుడు స్వజాతి సంస్థలు తప్ప మరేమైనా వచ్చాయా? అని ప్రశ్నించారు. పారదర్శకంగా టెండర్లు జరిగి ఉంటే చాలా కంపెనీలు వచ్చేవని..కోకాపేట అనేది చాలా కీలక ప్రాంతం అన్నారు. రేవంత్ రెడ్డి ముందు చెప్పినట్లుగానే శనివారం నాడుమీడియా ముందుకు వచ్చి ఈ భూముల వ్యవహారంపై మాట్లాడారు. ప్రెస్టీజ్ సంస్థకు కెటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ లు కోట్ల రూపాయలు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా బుద్వేల్ లో అనుమతులు ఇచ్చారని ఆరోపించారు. అందుకే మొత్తం కావాల్సిన వాళ్ళకే ఈ భూములు అమ్మేశారని..మళ్ళీ తర్వాత ఇవి కెటీఆర్ బావమరిది కంపెనీకో..మరో కంపెనీయే రంగంలోకి దిగి డెవలప్ చేస్తుందని అన్నారు.
టెండర్లలో ఎవరైనా పాల్గొనొచ్చు కదా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా..కెసీఆర్ అవినీతి గురించి మాట్లాడితే మీడియాలోనే స్క్రోలింగ్ రాదని..అంతా భయం భయంగా చూస్తుంటారని..వందల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేవాడు ప్రభుత్వం తరపున ఓ కలెక్టర్ బెదిరిస్తే వచ్చి ఇక్కడ వ్యాపారం చేయగలడా అని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూలేని విధంగా మీడియా భయపడుతుందన్నారు. వెంకట్రామిరెడ్డి బెదిరింపుల గురించి స్వయంగా కంపెనీలే చెప్పాయన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేస్తే బిజెపి, టీఆర్ఎస్ ల చీకటి బండారం కూడా బయటకు వస్తుందని అన్నారు. మాట్లాడితే సోదరుడు బండి సంజయ్ సవాళ్లు చేస్తున్నాడు అని..కెసీఆర్ అవినీతి తేలుస్తా...జైలుకు పంపుతా అంటున్నాడు కదా..మరి ఆధారాలతో కూడిన ఈ వెయ్యి కోట్ల దొంగతనం ఇంకా పచ్చిగానే ఉందని..చర్యలు తీసుకుంటారో లేదో చూద్దామన్నారు. వీరిద్దరి మధ్య చీకటి ఒప్పందాన్ని కూడా ఇది తేలుస్తుందని వ్యాఖ్యానించారు. ఎవరైనా నెత్తిమీద జుట్టు ఊడిపోతుందని గుండు కొట్టిచుకుంటామా అని ప్రశ్నించారు. జుట్టు ఊడిపోకుండా ఏమి చేయాలో అది చేసుకోవాలన్నారు. ప్రభుత్వం తాగి పడుకుంటే ఎవరైనా కబ్జా పెడతారు అంటూ కబ్జా వ్యాఖ్యలపై ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి. తాను ఆరోపణలు చేయటం లేదని..అన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని తెలిపారు. వెంకట్రామిరెడ్డికి చెందిన రాజపుష్ప అసలు ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నది..ఎక్కడ ఏమేమి చేస్తున్నది త్వరలో వెల్లడిస్తానన్నారు.