Telugu Gateway
Politics

చంద్రబాబుకు నోటీసిస్తే తప్పేంటి?

చంద్రబాబుకు నోటీసిస్తే తప్పేంటి?
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడికి ఏపీ సీఐడీ నోటీసులపై అధికార, విపక్షాలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. అమరావతి భూ స్కామ్ కు సంబంధించి..ముఖ్యంగా దళితులకు ఇచ్చిన అసైన్ మెంట్ భూముల వ్యవహారంలో చోటుచేసుకున్న అక్రమాలపై రగడ నడుస్తోంది. కక్ష సాధింపులో భాగంగానే నోటీసులు ఇచ్చారని టీడీపీ ఆరోపిస్తుంటే..అక్రమాలు చేసిన వారికి నోటీసులు ఇస్తే తప్పేంటి అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. టీడీపీ విమర్శలకు వైసీపికి చెందిన పలువురు నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ అంశంపై మంత్రి కొడాలి నాని స్పందిస్తూ సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓలతో దళిత వర్గాలను మోసం చేశారని ఆరోపించారు.

అసైన్ మెంట్ భూముల హక్కుదారులైన దళితులను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారని చెప్పారు. దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కోపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. ఆంబోతుల అచ్చెన్నాయుడు అరుస్తున్నా, కుక్కల బుద్ధ వెంకన్న మొరుగుతున్నా తాము అదిరేది లేదు బెదిరేది లేదని స్పష్టం చేశారు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సీ నోటీసులు జారీ చేశారని తెలిపారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కామ్‌లకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏమనుకున్నా, దళిత వర్గాలకు చెందిన వందలాది కోట్లు కాజేసిన చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

Next Story
Share it