చంద్రబాబుకు కేశినేని నాని ఝలక్
విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది. ఆయన ఎప్పటి నుంచో పార్టీ అధినేత చంద్రబాబునాయుడి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన కార్యాలయంలో చోటుచేసుకున్న వ్యవహారం ఆసక్తికరంగా మారింది. కార్యాలయంలో ఆయన చంద్రబాబు ఫోటోలు తొలగించేసి.. చంద్రబాబు స్థానంలో రతన్ టాటాతో తాను ఉన్న ఫోటోలను కేశినేని నాని ఉంచారు. వచ్చే ఎన్నికల్లో తాను కానీ..తన కుమార్తె ఎవరూ విజయవాడ లోక్ సభ బరి నుంచి పోటీలో ఉండమని చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ తర్వాత అదేమిలేదన్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు ఫోటోలను కేశినేని నాని తొలగించటం చర్చనీయాంశంగా మారింది. కేశినేని భవన్ వెలుపల ఏర్పాటు చేసిన తన పార్లమెంటరీ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్‌చార్జులు, ఇతర ముఖ్య నాయకుల ఫొటోలను కూడా తొలగించేశారు.
వాటి స్థానంలో టాటా ట్రస్టు, తన ఎంపీ నిధుల ద్వారా గతంలో చేసిన సేవా కార్యక్రమాలు, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలతో కూడిన ఫొటోలను ఉంచారు. కేశినేని నాని పూర్తిగా టీడీపీకి దూరం అవుతారా?. ఆయన ఏమైనా బిజెపిలో చేరతారా అన్న చర్చ సాగుతోంది. అయితే ఏపీలో బిజెపి పరిస్థితి ఏ మాత్రం ఆశాజనకంగా లేదు. ఇప్పటికే టీడీపీ నుంచి చేరిన వారు పరిస్థితి అక్కడ ఎలా ఉందో అందరూ చూస్తున్నారు. ఈ తరుణంలో నాని తన రాజకీయ భవిష్యత్ కు సంబందించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయంలో జరిగిన పరిణామాలతో కేశినేని నాని అధినేత తీరుపై ఆగ్రహంతో ఉన్నారు.