కెసీఆర్ నీ టైమ్ అయిపోయింది..ఇక సర్దుకో
ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ గా మారుస్తాం
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం దానిపైనే
ముఖ్యమంత్రి కెసీఆర్ పై మరోసారి టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కెసీఆర్ అంటే మోసం అని వ్యాఖ్యానించారు. మోసం ముందు పుట్టిందా..కెసీఆర్ ముందు పుట్టారా అంటే చెప్పటం కష్టం అని వ్యాఖ్యానించారు. మంగళవారం నాడు టీఆర్ ఎస్ కార్యవర్గ సమావేశంలో సీఎం కెసీఆర్ మాట్లాడుతూ బీసీలకు..గిరిజనులకు తానే బంధు ఇస్తానని చేసిన వ్యాఖ్యలపైనా రేవంత్ స్పందించారు. కెసీఆర్ నీ టైమ్ రాదు..ఇక ఇంటికే... సర్దుకో..నువ్వు ఇచ్చేది లేదు..జనం తీసుకునేది లేదు..నీ టైమ్ ఇక రాదు. నాలుగు కోట్ల ప్రజలకు టైమ్ వచ్చింది అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమంలో కెసీఆర్ పడిన కష్టానికి కంటే తెలంగాణ సమాజం ఎక్కువే ఇచ్చింది. ఇక చాలు. పదవులు..వేల కోట్ల రూపాయలు ఆస్తులు ఇచ్చారు. ఇక తెలంగాణ సమాజం దగ్గర ఏముంది కెసీఆర్ కు ఇవ్వటానికి అని ప్రశ్నించారు. తెలంగాణ వచ్చింది కెసీఆర్ ఫ్యామిలీకి పదవులు... మెగా క్రిష్ణారెడ్డి పీపీ రెడ్డి, యశోదా ఆస్పత్రి, కావేరి సీడ్స్ కోసమా అని ప్రశ్నించారు. సోనియాగాంధీ ఇచ్చిన తెలంగాణ గజదొంగల చేతిలో పెట్టినట్లు అయిందన్నారు. టీఆర్ఎస్ నేతలు బందిపోట్లలా దోచుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ నేతలు అడవి దున్నలు..పందులు కంటే దారుణంగా దోచుకుంటున్నారని, బంగారు తెలంగాణ అని కంగాళీ తెలంగాణ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దళిత, గిరిజన, బహుజన బిడ్డల విద్య కోసం ప్రత్యేక బడ్జెట్ పెడతామని ..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి సంతకం దీనిమీదేనన్నారు. ఎవరు సీఎం అయిన తొలి సంతకం దీనిమీదే ఉంటుందని అన్నారు. దేవుడి తనకు అన్నీ ఇచ్చాడు అని...ఉన్న ఒక్క బిడ్డ పెళ్లి కూడా అయిపోయింది..జూబ్లిహిల్స్ లో ఇళ్ళు ఉంది..భూములు ఉన్నాయని..సోనియా, రాహుల్ గాంధీలు ఇచ్చిన బాధ్యత నేరవేర్చటమే తన పని అన్నారు.
సీఎం కెసీఆర్ జపాన్ ఎలుకలాంటి వాడని ప్రమాదం ముందే పసిగట్టి..ఫామ్ హౌస్ వదిలిపెట్టి గత నలభై రోజులుగా కాలు కాలిన పిల్లిలా తిరుగుతున్నడని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఎవరైనా కెసీఆర్ ను జాలిదలిస్తే ఇక అంతే సంగతులు అన్నారు. ఉద్యమకారులకు గౌరవం పెరగాలంటే కెసీఆర్ పదవి నుంచి దిగిపోవాలన్నారు. సీఎం కెసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లిలో ముగిసిన రేవంత్ రెడ్డి దీక్ష ముగింపు సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'దత్తత గ్రామాలను కెసీఆర్ దగా చేశారు. ఈ గ్రామాల్లో దళితులకు భూములు ఇచ్చారా?. టీఆర్ఎస్ వాళ్ల డొక్కచించి డోలు వాయించే రోజు వస్తుంది. ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ గా మారుస్తా. దళిత, ఆదివాసీలకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా మారుస్తాం. ఇక్కడ నుంచే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అయ్యేలా శిక్షణ ఇప్పిస్తా. చదువుకుంటేనే భవిష్యత్. రాజ్యాధికారం రావాలన్నా..ఉద్యోగాలు రావాలన్నా చదువే ముఖ్యం. అందుకే దళిత, గిరిజన, ఆదివాసీ బిడ్డలకు అది అందకుండా కెసీఆర్ చేస్తున్నారు. చదువుకుంటే పదవుల్లో వాటా అడుగుతారనే భయం. హుజూరాబాద్ లో అయ్య గెలుస్తామంటున్నాడు.కొడుకు మాత్రం గెలిస్తే ఎంత..ఓడితే ఎంత అంటున్నాడు. అయ్య చెప్పింది అంతా అబద్దం అని కొడుకే చెబుతున్నాడు. అంటే విషయం వాళ్లకు అర్ధం అయింది.' అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణ వచ్చింది కెసీఆర్, మల్లారెడ్డి కుటుంబాల కోసమా అని ప్రశ్నించారు.