Telugu Gateway
Politics

బిఆర్ఎస్ టెన్షన్ మార్చి 20 కి వాయిదా!

బిఆర్ఎస్ టెన్షన్ మార్చి 20 కి వాయిదా!
X

లిక్కర్ స్కాం లో ముఖ్యమంత్రి కెసిఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత పేరు వచ్చినప్పటినుంచి ఆ పార్టీ లో ఒకటే టెన్షన్. ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయితే అది రాజకీయంగా బిఆర్ఎస్ పై ప్రతికూల ప్రభావం చూపించటం ఖాయం.అందుకే బిఆర్ఎస్ లో ఎక్కడలేని టెన్షన్ నెలకొని ఉంది. ఈ స్కాం లో కవిత కు నోటీసులు వస్తే చాలు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు అంతా ఢిల్లీ కి క్యూ కడుతున్నారు. ఈ స్కాం కు పూర్తిగా రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. గురువారం నాడు ఢిల్లీ లో దీనికి సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకున్నాయి. వాస్తవానికి ఎమ్మెల్సీ కవిత గురువారం నాడు ఈడీ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ ఆమె హాజరు కాకుండా తన ప్రతినిధి ద్వారా ఒక లేఖతో పాటు అధికారులు అడిగిన కొన్ని వివరాలు కూడా అంద చేశారు . సుప్రీం కోర్టు లో తాను వేసిన పిటిషన్ మార్చి 24 న విచారణకు వస్తున్నందున అప్పటివరకు ప్రొసీడింగ్స్ నిలిపివేయాలని కోరారు. అయితే కవిత లేఖ అందిన కొన్ని గంటల్లోనే ఈడీ దీనిపై స్పందించి మరో సారి కవిత కు నోటీసులు జారీ చేసింది. మార్చి 20 న హాజరు కావాలని స్పష్టం చేసింది.

అంతే కాకుండా కవిత తో కలిసి విచారించాల్సి ఉన్నందున అరుణ్ రామచంద్ర పిళ్ళై కస్టడీ పొడిగించాలని ఈడీ కోర్టు ను కోరగా కోర్టు మూడు రోజులు కస్టడీ పొడిగింపుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇప్పుడు కవిత మార్చి 20 న హాజరు అన్నది ఈ కేసు లో అత్యంత కీలకంగా మారనుంది.బిఆర్ఎస్ నేతలు కేంద్రంలో ఉన్న మోడీ సర్కారును ప్రశ్నిస్తున్నందునే తమను టార్గెట్ చేశారని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తో పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న అరబిందో డైరెక్టర్ శరత్ చంద్రా రెడ్డి, పలువురు పారిశ్రామిక వేత్తలు అరెస్ట్ అయ్యారు. తాజాగా వైసీపీ ఎంప్ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కు కూడా తాజాగా ఈడీ ఇదే లిక్కర్ స్కాం లో నోటీసులు జారీచేసింది. ఇప్పటికే అయన తనయుడు మాగుంట రాఘవ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు. తాజా పరిణామాలతో కవిత ఇష్యూ లో బిఆర్ఎస్ టెన్షన్ మార్చి 20 కి వాయిదా పడినట్లు అయింది. మరి ఈ లోగా ఎన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచిచూడాలి.

Next Story
Share it