కెసీఆర్ మోడీ సుఫారీ గ్యాంగ్
కాంగ్రెస్ ను బలహీనపర్చేందుకే ఈ డ్రామాలు
దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలి
కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసానికి రేవంత్
ఇద్దరూ కలసి మీడియా ముందుకు
దేశంలోనూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకే ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఉన్న నేతలతో చర్చలు జరుపుతూ యూపీఏను బలహీనపర్చాలని చూస్తున్నారని..నిజంగా కెసీఆర్ కు మోడీని బలహీనం చేయాలంటే మాత్రం ఏపీ సీఎం జగన్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, కర్ణాటకలో దేవేగౌడ, ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న నితీష్ కుమార్ వంటి వారితో ఉపయోగం ఉంటుంది కానీ..అందుకు భిన్నంగా కెసీఆర్ పనిచేస్తున్నారన్నారు. ఇది అంతా కూడా మోడీ కోసం పనిచేస్తున్న సుపారీ గ్యాంగ్ పని అని ఆరోపించారు. అమిత్ షా సూచనల మేరకు. ఎన్నికల వ్యూహకర్త సలహాలు, సూచనల మేరకే కెసీఆర్ ఈ పనిచేస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులను గందరగోళంలోకి నెట్టేందుకే కాంగ్రెస్ కు అనుకూలంగా ప్రకటనలు చేస్తున్నారని..కాంగ్రెస్ నేతల ఇళ్ల ముందుకు వచ్చి బూట్లు తుడిచినా కూడా కెసీఆర్ తో జతకట్టే ప్రసక్తే ఉండదన్నారు.
ఈ సుపారీ దొంగల నుంచి అప్రమత్తంగా ఉండాలని..వీరి ఎక్కడ దొరికినా పాతరేయాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఓటమి తప్పదని ఖరారైన తర్వాత ప్రంట్లు..టెంట్లు అంటూ కొత్త డ్రామాకు తెరతీశారని..ఇది అంతా కూడా మోడీ దర్శకత్వంలోనే సాగుతుందని తెలిపారు. ఓ వైపు నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కెసీఆర్ మూడు రోజుల పుట్టిన రోజు చేసుకుంటారా అని ప్రశ్నించారు. ఎన్ని రోజులైనా చేసుకోండి కానీ...నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్ ఇచ్చి చేసుకోవాలన్నారు. కెసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఒక్కో నియోజకవర్గంలో గాడిదకు పుట్టిన రోజు ఉత్సవాలు చేయాలని రేవంత్ పిలుపునిచ్చారు. అప్పుడైనా అధికారంలో ఉన్న గాడిదలకు బుద్ధి వస్తుందో చూద్దామన్నారు.
తెలంగాణ ఉద్యమంలో మరణించింది నిరుద్యోగులే..రాష్ట్రం వచ్చాక ఉద్యోగాలు రాక చనిపోతుంది కూడా యువతే అన్నారు. రేవంత్ రెడ్డి మంగళవారం నాడు కాంగ్రెస్ సీనియర్, ఎంపీ కోమటిరెడ్డి నివాసానికి వెళ్ళి ఆయనతో చర్చలు జరిపారు. రాష్ట్రంలో పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు..భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు ఇరువురు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డిపై రేవంత్ ప్రశంసలు కురిపించారు. కెసీఆర్ కు సమానంగా ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం పారాడారన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఓ వైపు ధనిక రాష్ట్రం అంటూ రైతులను ఎందుకు ఆదుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కూడా గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్లలో పూర్తయ్యాయన్నారు. తన పార్లమెంట్ నియోజకవర్గంలో ఆరేళ్ళలో ఎన్ని పూర్తయ్యాయో చెప్పాలన్నారు.