రాత్రి పూట పై కర్ఫ్యూపై కర్ణాటక యూటర్న్
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప గందరగోళంలో ఉన్నట్లు ఉన్నారు. ముందు ప్రకటన చేయటం..తర్వాత తూచ్ అనటం ఆయనకు అలవాటుగా మారిపోయింది. దీపావళి క్రాకర్స్ దగ్గర నుంచి ఆయనది అదే వరస. ముందు రాష్ట్రంలో దీపావళి సందర్భంగా గ్రీన్ కాకర్స్ తో సహా ఏమీ కాల్చటానికి వీల్లేదని ప్రకటించారు. ఇందుకు కరోనాను కారణంగా చూపారు. తర్వాత ఏమైందో ఏమో కానీ గ్రీన్ క్రాకర్స్ కాల్చుకోవచ్చంటూ ప్రకటన చేశారు. ఇప్పుడు రాత్రి కర్ఫ్యూ విషయంలో సేమ్ సీన్.
సీఎం యడ్యూరప్ప స్వయంగా మీడియా ముందుకు వచ్చి 22 అర్ధరాత్రి నుంచి జనవరి 2 వరకూ రాష్ట్రంలో రాత్రి పది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకూ కర్ఫ్యూ ఉంటుందని ప్రకటించారు. కానీ ఇప్పుడు కర్ఫ్యూ లేదని..మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటిస్తే సరిపోతుంది అంటూ ప్రకటన చేశారు. మరి ముందు కర్ఫ్యూ ప్రకటన ఎందుకు చేసినట్లు?. తర్వాత వెనక్కి ఎందుకు తగ్గినట్లు అన్నది మాత్రం తెలియదు. ఓ వైపు మహారాష్ట్రతోపాటు పలు రాష్ట్రాలు రాత్రి పూట కర్ఫ్యూ అమలు చేస్తున్నాయి.