కర్ణాటక శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య
కర్ణాటకలో కలకలం. ఆ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మెగౌడ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ వ్యవహారం అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ఆయన జెడీఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. సోమవారం సాయంత్రం ఇంటి నుంచి స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్ళిన ఆయన శవం రైల్వే ట్రాక్ పక్కన కనపడింది. మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ధర్మెగౌడ మృతదేహన్ని రైల్వే ట్రాక్ పక్కన గుర్తించారు. పోలీసులు చెబుతున్న విషయాల ప్రకారం ఆయన రైలు కింద ఆత్మహత్య చేసుకున్నారని. ఆయన మృతదేహం దగ్గర సూసైడ్ నోట్ కూడా ఉందని సమాచారం.
కొద్ది రోజుల క్రితం జరిగిన మండలి సమావేశాల్లో జరిగిన ఘర్షణల్లో సభాపతి సీటులో ఉన్న ఉప సభాపతి ధర్మెగౌడను కాంగ్రెస్ సభ్యులు సీటు నుంచి కిందకు లాగేశారు. మండలి ఘటనతో డిప్యూటీ ఛైర్మన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ధర్మేగౌడ ఆత్మహత్యకు మరేదైనా వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ మృతిపై మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.