కర్ణాటక సీఎంకు మళ్లీ కరోనా..ఆస్పత్రికి తరలింపు
కరోనా రెండవ దశ దేశవ్యాప్తంగా కలవరం రేపుతోంది. ఎవరు ఎప్పుడు వైరస్ బారిన పడతారో తెలియని పరిస్థితి. పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూతో పాటు పలు చర్యలు తీసుకుంటున్నా కూడా వైరస్ వ్యాప్తి మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. తొలి దశ కంటే రెండవ దశే మరింత భయానకంగా కన్పిస్తోంది. ప్రపంచంలో ఎక్కడాలేని రీతిలో రోజువారీ కేసుల సంఖ్యే రెండు లక్షలు దాటుతుంది అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. తాజాగా కర్ణాటక సీఎం యడ్యూరప్ప రెండవ సారి కరోనా బారిన పడ్డారు. ఆయనకు జ్వరం రావటంతో పరీక్షలు చేయించుకున్నారు.
దీంతో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆ వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు పొలిటికల్ లీడర్స్ కు కరోనా పాజిటివ్ అని తేలింది. మళ్లీ తనకు కరోనా పాజిటివ్ అని తేలిందన్న విషయాన్ని యడ్యూరప్ప ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చినందున ఇటీవల తనను కలిసిన పార్టీ కార్యకర్తలు, నేతలు, అధికారులు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అందరూ సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.