కర్ణాటక ఎగ్జిట్ పోల్స్ ..లీడ్ లో కాంగ్రెస్!

హంగ్ ఛాన్స్ ..జెడిఎస్ మళ్ళీ కింగ్ మేకర్ అవుతుందా?
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఒక సంకేతంగా భావిస్తూ వచ్చినా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముగిసాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేసాయి. అయితే ఇందులో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ కి నామమాత్రపు లీడ్ చూపిస్తున్నాయి. కొన్ని సంస్థలు అయితే బీజేపీ కి ఎడ్జ్ ఉంది అని చెపుతున్నాయి. దీంతో కర్ణాటక లో హంగ్ వస్తుందా లేక క్లియర్ మెజారిటీ నా అన్నది తేలాలి అంటే ఫలితాలు వెలువడే మే 13 వరకు ఆగాల్సిందే. హోరా హోరీగా సాగిన కర్ణాటక ఎన్నికలపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున అసలు పెట్టుకుంది. ఆ పార్టీ అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగి ప్రచారం నిర్వహించారు. అధికార బీజేపీ కూడా మరో సారి కీలకమైన దక్షిణాది రాష్ట్రాన్ని కాపాడుకొనేందుకు సర్వశక్తులు ఒడ్డింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రధాని మోడీనే కర్ణాటక ఎన్నికల ప్రచార బాధ్యతలు చూశారు అని చెప్పొచ్చు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ని పక్కన పెట్టి ఎక్కువగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ,ఫ్రీయాంక. ఫైనల్ టచ్ లో సోనియా కూడా వచ్చారు. 224 సీట్లు ఉన్న కర్ణాటకలో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 113 సీట్లు. పీపుల్స్‌పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 107-119, బిజెపికి 78-90, జేడీ(ఎస్)కు 23-29, ఇతరులకు 1-3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ 2 శాతం అని ఈ సంస్థ తెలిపింది.
జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ పార్టీ కి 103 నుంచి 118 సీట్లు వస్తాయని...బీజేపీ కి 79 -94 మధ్య సీట్లు వచ్చే అవకాశం ఉంది అని తెలిపింది. రిపబ్లిక్ టీవీ అంచనాల ప్రకారం బీజేపీ కి 85 నుంచి 100 సీట్లు, కాంగ్రెస్ పార్టీ కి 94 నుంచి 108 సీట్లు వచ్చే అవకాశం ఉంది అని తెలిపింది. టీవీ 9 భారత్ వర్ష్ ఎగ్జిట్ పోల్ ప్రకారం బీజేపీ కి 88 నుంచి 98 సీట్లు , కాంగ్రెస్ పార్టీ కి 99 నుంచి 109 వరకు వచ్చే అవకాశం ఉంది అని తెలిపారు. అన్నీ ఎగ్జిట్ పోల్స్ లోనే జెడీఎస్ కు 25 సీట్ల వరకు ఛాన్స్ కనిపిస్తోంది. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ కు 106 నుంచి 120 వరకు వస్తాయని...బీజేపీ కి 78 నుంచి 92 వరకు రావొచ్చు అని తేల్చింది. ఈ ఎగ్జిట్ పోల్స్ నిజం అయితే మరో సారి జెడీఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం తీవ్రమైన అవినీతి ఆరోపణల్లో మునిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ కూడా 40 శాతం అవినీతి అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసింది.



