కర్ణాటక రిజల్ట్ ..ఇది మోడీ ఓటమే
ప్రజల్లో వ్యతిరేకత ఉంటే ప్రధాని మోడీ కూడా ఏమి చేయలేరు. ఎన్ని రోడ్ షో లు చేసినా...ఎన్ని ప్రచారాలు చేసినా ప్రజలు మాత్రం తమ తీర్పు ఎలా ఇవ్వాలనుకుంటే అలాగే ఇస్తారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇదే చెప్పాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో స్థానిక నాయకులను పక్కన పెట్టి షో అంతా ప్రధాని మోడీ..అమిత్ షా లే చేశారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైని చూసి కాకుండా మోడీ ని చూసి గెలిపించాలని బీజేపీ కోరినా ఫలితం దక్క లేదు. డబల్ ఇంజిన్ సర్కార్ నినాదం కూడా కర్ణాటక లో ఏ మాత్రం పని చేయలేదు అని చెప్పాలి. బీజేపీ సర్కారు 40 శాతం కమిషన్ సర్కారు అనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. దీనికి తోడు కాంట్రాక్టర్స్ కూడా బహిరంగంగా ఈ విషయాన్నీ ప్రకటించటం తో ఇది బీజేపీ ని చాలా వరకు ఇరుకున పెట్టింది. ఒకప్పటి కాంగ్రెస్ పార్టీ లాగా బీజేపీ కూడా తరచూ ముఖ్యమంత్రుల మార్పు...మెజారిటీ లేకపోయినా ఇతర పార్టీ ల నాయకులను ప్రలోభ పెట్టి అధికారంలోకి రావటం వంటి పనులు చేస్తూ తమకూ కాంగ్రెస్ కూడా పెద్ద తేడా ఏమీ లేదు అని చూపించారు బీజేపీ నేతలు.
ఇది ఒక్క కర్ణాటక విషయంలోనే కాకుండా పలు రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఇదే ట్రెండ్ సెట్ చేసింది ..ఫాలో అయింది . మరో కీలక విషయం ఏమిటి అంటే జాతీయ పార్టీ అయినా కూడా మోడీ, అమిత్ షా లు బీజేపీ ని ఒక ప్రాంతీయ పార్టీ లా నడపటం ప్రారంభించారు. ఇది కూడా పలు రాష్ట్రాల్లో నేతలకు నచ్చక పోయినా ప్రస్తుతం వారి హవా ఉంది కాబట్టి మౌనంగా భరిస్తూ వస్తున్నారు. మరి కర్ణాటక ఫలితాల తర్వాత ఏమైనా మార్పు వస్తుందా లేదా అన్నది కొంత కాలం పోతే కానీ తెలియదు. కర్ణాటక ఎన్నికల్లో మోడీ ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేశారు. ఒక వైపు అయన స్థానిక నాయకుడి కంటే ఎక్కువ ప్రచారం చేసి సోనియా గాంధీ ప్రచారానికి వస్తే కూడా విమర్శలు చేశారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే బీజేపీ పెద్ద ఎత్తున సీట్లలో మార్పులు చేసినా...సీనియర్ లకు టికెట్స్ ఇవ్వకుండా కొత్త పేస్ లను తెరపైకి తెచ్చిన ఏ మాత్రం ఫలితం లేకుండా పోయింది.