కర్ణాటక ఫలితాలు ...తెలంగాణకూ కీలకం
దక్షిణాదిన అత్యంత కీలక రాష్ట్రమైన కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధం అయింది. ఇవి అత్యంత కీలక ఎన్నికలుగా చెప్పుకోవాలి. కర్ణాటక తర్వాత తెలంగాణ లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణ పై ఉంటుంది అనే అంచనాలు ఉన్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. దీని ప్రకారం మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఆ వెంటనే అంటే మే 13న కౌంటింగ్ జరుగుతుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 13 న నోటిఫికేషన్ జారీచేయనున్నారు.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఓట్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కల్పిస్తున్నారు. . 80 ఏళ్లు దాటినవారు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం అందుబాటులోకి తెచ్చారు.
ఒకే విడతలో 224 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉంది. ఈ సారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఫలితాలు కచ్చితంగా వచ్చే లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో బీజేపీ కూడా మరో సారి అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. అయితే కర్ణాటకలోని బీజేపీ సర్కారు అవినీతి విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ కొద్దిరోజులుగా రాష్ట్రంలో పర్యటించి పలు అభివృద్ధి పనులు ప్రారంభించి ఎన్నికల ప్రచారం నిర్వహించారనే చెప్పొచ్చు. మరి కాంగ్రెస్ ఈ ఎన్నికల విషయంలో ఎంత మేర సత్తా చాటుతుందో వేచిచూడాల్సిందే.