Telugu Gateway
Politics

ఇక పార్టీ తోక‌లు త‌గిలించుకోద‌ల‌చుకోలేదు

ఇక పార్టీ తోక‌లు త‌గిలించుకోద‌ల‌చుకోలేదు
X

కాంగ్రెస్ పార్టీకి పున‌ర్జీవం కల్పించేందుకు ఆ పార్టీ అధిష్టానం ప్ర‌య‌త్నాలు చేస్తున్న త‌రుణంలో క‌పిల్ సిబాల్ రాజీనామాతో ఊహించ‌ని షాక్ త‌గిలింది. అయితే క‌పిల్ సిబాల్ చెబుతున్న‌దాని ప్ర‌కారం చూస్తే ఇది జ‌రిగి చాలా రోజులు అయినా విష‌యం మాత్రం వెలుగులోకి వ‌చ్చింది మాత్ర‌మే బుధ‌వారం నాడే. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్ప‌టంతో పాటు ఆయ‌న మ‌రో ఝ‌ల‌క్ ఇచ్చారు. స్వ‌తంత్ర అభ్య‌ర్ధిగా రాజ్య‌స‌భ‌కు నామినేష‌న్ వేశారు. అది కూడా ఎస్పీ మ‌ద్దతుతో. ఈ ప‌రిణామం ఆస‌క్తిక‌రంగా మారింది. గ‌త కొంత కాలంగా కీలక నేత‌లు అంద‌రూ పార్టీని వీడి వెళుతున్నారు. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకింత ఆందోళ‌న నెల‌కొని ఉంది. పార్టీని వీడిన త‌ర్వాత ఓ ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క‌పిల్ సిబాల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. భవిష్యత్తులో తాను ఎస్పీతో పాటు ఏ పార్టీలోనూ చేరబోనని స్పష్టం చేశారు. ఇలాంటి పరిణామాలు కష్టంగా అనిపించొచ్చు. కానీ, ప్రతి ఒక్కరూ స్వార్థంగా ఆలోచించాల్సిన అవసరమూ ఉందన్నారు.

ఇప్పుడు నా సమయం వచ్చింది. పార్లమెంట్‌లో స్వతంత్రంగా గళం వినిపించాలనుకుంటున్నా. ఏ పార్టీ కొర్రీలు తగిలించుకోవాలనుకోవట్లేదు. సుదీర్ఘకాలంగా ఓ పార్టీకి కట్టుబడి ఉండడం, ఆ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండడం చాలా చాలా కష్టమైన విషయం. ప్రతీ ఒక్కరూ వాళ్ల వాళ్ల గురించి ఆలోచించాలి. ఆ ఆచరణను అమలు చేయాలంటే కొత్తగా ఆలోచించాలి. అందుకే బయటకు రావాల్సి వచ్చింది. ప్రస్తుతం పరిస్థితులు అలాగే ఉన్నాయి.. అని తెలిపారు. కాంగ్రెస్‌ను వీడడం అనేది హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం ఏమీ కాదని, తానేమీ తమాషా చేయదల్చుకోలేదని, సంకేతాలు ఇచ్చినా ముందస్తుగా ఎవరికీ తెలియకపోవడం అనేది తనను కూడా ఆశ్చర్యపరిచిందని ఆయన అన్నారు.

Next Story
Share it