మెజారిటీ ఉందని ఐటి, ఈడీలతో దాడులు చేస్తారా?
అధికార టీఆర్ఎస్ పదే పదే ఇదే అంశాన్ని లేవనెత్తుతోంది. దీని వెనక కారణం ఏంటి అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆదివారం నాడు సీఎం కెసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. సోమవారం నాడు ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు ఈ అంశాన్ని లేవనెత్తారు. మెజారిటీ ఉందని ప్రతిపక్ష నేతల ఇళ్లపై ఐటి, ఈడీ రైడ్స్ చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి చెందిన పలు అంశాలను లేవనెత్తినట్లు కేశవరావు, నామా నాగేశ్వరరావులు వెల్లడించారు.తెలంగాణ పట్ల కేంద్రానికి ఎందుకు వివక్ష అని కేశవరావు ప్రశ్నించారు. రాష్ట్రానికి సంబంధించిన ఒక్కప్రాజెక్టులో కూడా కేంద్ర ప్రభుత్వం నుండి సహాయం అందలేదన్నారు. దేశంలో అనేక మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నారని, తెలంగాణకు మాత్రం ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. పెండింగ్ లో ఉన్న జిఎస్టీ, ఐజిఎస్టీ నిధులను రాష్ట్రాలకు విడుదల చేయడం లేదని, ఎందుకు తెలంగాణను శత్రువుగా చూస్తున్నారు.. విరోధం ఎందుకు పెంచుకుంటున్నారని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.
వరి ధాన్యం సేకరణలో జాతీయ సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని తీసుకురావాల్సి ఉందన్నారు. బాయిల్డ్ రైస్ సమస్య ఒడిశా తో పాటు అనేక రాష్ట్రాలను బాధిస్తోందని తెలిపారు. ఐటీ, ఈడీలు అయిపోయాయి ఇప్పుడు పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. పార్లమెంట్ ను, కేంద్ర సంస్థలను తాము కించపరచడం లేదని, అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తన అవసరాలకు వీటిని ఉపయోగించవద్దని అంటున్నామన్నారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై చర్చ జరగాలని అన్ని పార్టీలు కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. పెగసెస్ స్పైవేర్ సమస్య జాతీయ భద్రత అంశం అన్నారు.