వినాయక చవితిపై ఆంక్షలు వెనక్కి తీసుకోవాలి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలోని వినాయక చవితి పండగకు సంబంధించి ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధుల పుట్టిన రోజులకు లేని నిబంధనలు.. పండగలు పబ్బాలకు ఎందుకు అన్నారు. వినాయక విగ్రహాలు చేసే కళాకారుల్ని అరెస్టు చేసి విగ్రహాలు పట్టుకుపోతున్నారు, ఎవరి మీద దాడి చేస్తున్నారో ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. రథాలు దగ్ధం చేసి... శ్రీరాముడి విగ్రహానికి శిరచ్ఛేదం చేస్తే దోషులను ఈ రోజు వరకూ పట్టుకోలేదన్నారు. రహదారులను కోసం చెల్లించిన పన్నులు... సెస్సులు ఏమైపోయాయని ప్రశ్నించారు. రోడ్లపై గోతులు కాస్తా కాలువలయ్యాయి… ఇదీ వైసీపీ ప్రభుత్వం చేసిన అద్భుతం అంటూ ఎద్దేవా చేశారు. పక్క రాష్ట్రాలు వినాయక చవితి పూజలకు షరతులతో కూడిన అనుమతులు ఇస్తుంటే ఇక్కడ మాత్రం పండగను చేసుకోవద్దని చెప్పడం, గణపతి విగ్రహాలను అమ్మే వ్యక్తులను అరెస్టు చేయడం, విగ్రహాలు తీసుకుపోవడం చూస్తుంటే పాలకులు దేని మీద దాడి చేస్తున్నారో ఆలోచించుకోవాలి. మన భారతదేశంలో ఏ పని మొదలుపెట్టినా ముందుకు నమస్కరించేంది గణపతికే. విఘ్నాధిపతికి నమస్కారం చేసుకొనే ఏ పనైనా మొదలుపెడతాం. అలాంటి గణపతి పండగను జరుపుకోవద్దు అంటున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి. గతంలో కూడా విగ్రహాలను అపవిత్రం చేసినా, రథాలను కాల్చేసినా, శ్రీరాముడి విగ్రహానికి తలతీసేస్తే ఈ రోజు వరకు దోషులను పట్టుకోలేదు. వారిని పట్టుకోకపోగా, ఈ రోజు కొత్తగా వినాయక చవితి జరుపుకోవద్దు అని నిబంధనలుపెట్టడం దేనిని సూచిస్తున్నాయి. రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న పరిస్థితిపై ప్రజల నుంచి ఉవ్వెత్తున నిరసన రావడంతో దాని నుంచి తప్పించుకోవడానికి మేకపోతు గాంభీర్యంతో ఎయిర్ పోర్టులు, పోర్టులను అభివృద్ధి చేస్తున్నాం అంటూ సమీక్షలో తెలిపారు తప్ప ఇంకేం లేదు.
జనసేన పిలుపు మేరకు లక్షల మంది స్పందించి రోడ్ల దుస్థితిని తెలిపారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య దెబ్బ తిన్న రహదారులు. ఆ సమస్య గురించే మాట్లాడాలి. 'సొంతిల్లు చిమ్ముకోవడానికి చీపురు లేదుగానీ పక్కిళ్లు చిమ్మేస్తాం.. కల్లాపు చల్లేస్తాం.. ముత్యాల ముగ్గులు పెట్టేస్తాం' అనే చందంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి. ఈ మాట ఎందుకంటున్నానంటే పోర్టులు, ఎయిర్ పోర్టులు మెజార్టీ శాతం ప్రైవేటుపరం అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దాదాపు ప్రతి పెద్ద పోర్టు కూడా ప్రైవేటు కంపెనీల చేతుల్లోనే ఉంది. అక్కడ బెర్తులు నిర్మించాలన్న, అభివృద్ధి చేయాలన్నా వాళ్లు చూసుకుంటారు. వాటి అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర నామ మాత్రమే. ఎయిర్ పోర్టులను కూడా దాదాపు ఎయిర్ పోర్టు అధారటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడుస్తాయి. లేదా ప్రైవేటు సంస్థలు నడుపుతాయి. అక్కడ రన్ వేలు వాళ్లు చూసుకుంటారు. అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎయిర్ పోర్టుల్లో రన్ వేలు వేయదు. పోర్టుల్లో బెర్తులు నిర్మించదు. ఆ రెంటింటిని సంబంధింత కేంద్ర ప్రభుత్వ సంస్థలు చూసుకుంటాయి.