తెలంగాణలోనూ జనసేన పోటీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలపై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడతారు. గతంలో ఓ సారి తెలంగాణలో పార్టీ నడపటం అంత ఆషామాషీ వ్యవహారంకాదని..దీనికి చాలా ఖర్చు అవుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అందుకు బిన్నమైన ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో జనసేన పోటీ చేస్తుందని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో ఉంటామని...అది ఎవరితో కలసి..ఎలా అన్నది కాలం చెబుతుందని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు నవ నాయకత్వమే మార్గం అని, సామాజిక మార్పు కచ్చితంగా అవసరమన్నారు. పవన్ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే...'నాకు ఆంధ్ర జన్మనిస్తే, పునర్జన్మనిచ్చించి తెలంగాణ. అదే బాధ్యతతో తెలంగాణలో రాజకీయాలు చేస్తా. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా తెలంగాణలో జనసేన పార్టీ పోటీలో ఉంటుంది. ఎన్ని స్థానాలు.. ఎక్కడ.. ఎవరితో.. ఎలా ముందుకు వెళ్ళబోయేది పూర్తి స్థాయి ప్రణాళిక తో వచ్చే రోజుల్లో సమాధానం చెబుతామని వెల్లడించారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సైదులు అనే జనసైనికుడి కుటుంబానికి చౌటుప్పల్ మండలం లక్కారంలో పార్టీ తరఫున రూ. 5 లక్షల ప్రమాద బీమా చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు. తమ్ముడు సినిమా సమయంలో నాకు జరిగిన ఒక సంఘటన నన్ను చాలా ప్రభావితం చేసింది. సినిమా హిట్ అయ్యిందని.. ఫంక్షన్ చేద్దామని యూనిట్ సభ్యులు అంటే, అలా కాకుండా ఆ డబ్బుతో నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ తో బాధ పడుతున్న ఒక గ్రామాన్ని దత్తత తీసుకుందామని నేను ప్రతిపాదించాను. అయితే దీనికి మా సినిమా యూనిట్ ఒప్పుకున్నా, అక్కడి స్థానిక నాయకులు కొందరు ఒప్పుకోలేదు. ఇక్కడే నాలో అంతర్మథనం మొదలైంది. ప్రజలకు మేలు చేయాలంటే కచ్చితంగా రాజకీయ అండ అవసరం అని కృతనిశ్చయానికి వచ్చాను. అదే నన్ను రాజకీయాల వైపు నడిపించింది. దాని కోసమే 2007 నుంచి రాజకీయాల్లో ఉంటూ, తర్వాత తెలంగాణ గడ్డ పైనే పార్టీ ప్రస్థానం మొదలు పెట్టాను.
తాను ఓడినా బాధ్యతతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తిని అన్నారు. ఓడిపోయాను కాబట్టి మరింత అనుభవం, బాధ్యత వచ్చాయి. ఇక నుంచి జనసేన నాయకులు తెలంగాణ సమస్యలు తెలుసుకుంటారు. ప్రతి నియోజకవర్గంలో తిరుగుతారు. నేను సైతం ప్రతి నెలలో వీలును బట్టి తెలంగాణ ప్రాంతంలో తిరిగేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తాను. హైదరాబాద్ లో ప్రత్యేక కార్యాలయం తీసుకుని అక్కడ తెలంగాణ అంశాలపై చర్చించి తగు నిర్ణయం తీసుకుంటాం. పార్టీ నిర్మాణం చాలా క్లిష్టతరమైన బాధ్యత. ఆంధ్ర లో సైతం నాలుగేళ్లు తిరిగి, అక్కడి పరిస్థితి.. సమస్యల పరిశీలన చేసిన తర్వాతే పార్టీ నిర్మాణం చేపట్టాం. తెలంగాణ మీద ఇక ప్రత్యేక ద్రుష్టి ఉంటుంది. 25 ఏళ్ళు భవిష్యత్ అనే మాట నేను ఊరికే అనను. అన్నీ గమనించిన తర్వాత, అన్నీ విషయాలు అర్ధం చేసుకున్న తర్వాత మాత్రమే రాజకీయ అడుగులు వేస్తాం. పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడాలి అన్నదే లక్ష్యం అని వ్యాఖ్యానించారు. ప్రతి నియోజకవర్గంలో తమకు ఐదు వేల ఓట్లు ఉంటాయని..వీటితో గెలుపు సాద్యంకాకపోయినా..తామే కీలకం అవుతామన్నారు.