Telugu Gateway
Politics

గ్రామీణ ప్రాంతాల్లో బలంగా జనసేన

గ్రామీణ ప్రాంతాల్లో బలంగా జనసేన
X

ఇదే స్పూర్తిని మున్సిపల్ ఎన్నికల్లోనూ చూపించాలి

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా వైసీపీ భయపడుతోందని అన్నారు. గ్రామీణ స్థాయిలో జనసేన పార్టీ చాలా బలంగా ఉందనే విషయాన్ని పంచాయతీ ఎన్నికల ఫలితాల గణంకాలే రుజువు చేస్తున్నాయని వ్యాఖ్యానించారు. మొదటి విడతలో 18 శాతానికి పైగా ఓట్లు వస్తే... రెండో విడతలో అది 22 శాతం దాటిందని తెలిపారు. 'పార్టీ భావజాలం, పార్టీ శ్రేణుల మద్దతుతో రెండో దశలో 250కి పైగా సర్పంచ్, ఉప సర్పంచ్ స్థానాలు గెలిచాం. 1500 పైగా పంచాయతీల్లో రెండో స్థానంలో నిలిచాం. 1500 వార్డులను కైవసం చేసుకున్నాం. ఈ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ ఒత్తిళ్లు, బెదిరింపులు, ప్రలోభాలకు తట్టుకొని యువత, ఆడపడుచులు నిలబడటం నిజంగా గర్వకారణం. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందనలు తెలియచేస్తున్నాను. పోటీలో నిలిచినవారికి జనసైనికులు, నాయకులూ అండగా నిలిచారు. జనసేన మద్దతుదారుల గెలుపుతో మార్పు మొదలైంది. మార్పు మొదలయ్యేటప్పుడే భయపెడతారు.

అధికార పక్షంవాళ్ళు మజిల్ పవర్ చూపిస్తున్నారు.' అని ఆరోపించారు. గ్రామ వాలంటీర్ల వ్యవస్థను అధికార పార్టీ ఎమ్మెల్యేలు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. భారతదేశానికి గ్రామాలే వెన్నెముక. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే దేశం ముందుకెళ్తుంది. పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించాల్సిన అవసరం ఉంది. గ్రామాల్లో ఏ పనులకు ఎంత ఖర్చు చేయాలో సర్పంచులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే హక్కు ఉండాలి. ముఖ్యమంత్రో, కలెక్టర్లో కాదు నిర్ణయం తీసుకునేది. కానీ మన దౌర్భాగ్యం పంచాయతీలను రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రిస్తున్నాయి. మన రాష్ట్రానికి, కేరళ రాష్ట్రానికి చాలా తేడా ఉంది. మన దగ్గర ఒకలాంటి మజిల్ పవర్ ఉపయోగించి ప్రభుత్వంలో ఉన్న పార్టీలు ఏకగ్రీవం చేసుకుంటాయి. కేరళ రాష్ట్రంలో ఏకగ్రీవాలు చాలా తక్కువ. ఏ రకంగా చూసినా ఏకగ్రీవాలు మంచిది కాదు. పోటీతత్వం ఉండాలి. పోటీతత్వం వల్లే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుంది. కేరళ తరహా పంచాయతీ వ్యవస్థ బలోపేతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మున్సిపల్ ఎన్నికలకు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. ఎన్నికలు పెట్టడం మంచిదే అయినా..పాత నోటిఫికేషన్ అని చెప్పటం అసంతృప్తిని ఇచ్చిందని తెలిపారు. జనసైనికులు పంచాయతీ ఎన్నికల్లో చూపిన స్పూర్తినే మున్సిపల్ ఎన్నికల్లోనూ చూపించాలని కోరారు.

Next Story
Share it