Telugu Gateway
Politics

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన దూరం

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు జ‌న‌సేన దూరం
X

గ్రేట‌ర్ లో బ‌రిలో నిలుస్తాన‌ని ప్ర‌క‌టించిన జ‌న‌సేన చివ‌రి నిమిషంలో ప్లేటు ఫిరాయించింది. కేవ‌లం బిజెపికి మ‌ద్ద‌తు ఇ‌స్తామనిజ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ‌ప్ర‌క‌టించారు. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ లో రక్షణగా నిలిచే వ్యవస్థ ఉండాలంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ (జి.హెచ్.ఎం.సి.) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి. అందుకు జనసేన పార్టీ మద్దతుగా నిలుస్తుంది అని జనసేన పార్టీ అధ్యక్షులు ప‌వ‌న్ కల్యాణ్ ప్రకటించారు. హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జి.హెచ్.ఎం.సి. ఎన్నికల పోటీ నుంచి అభ్యర్థులను ఉపసంహరించుకొంటున్నట్లు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్ సమావేశమై జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో కలసి పని చేయడంపై చర్చించారు. నాదెండ్ల మనోహర్ ఇంట్లో రెండు గంటలసేపు ఈ చర్చలు సాగాయి.

పవన్ కల్యాణ్ మాట్లాడుతూ "విశ్వ నగరంగా హైదరాబాద్ ఎదుగుతున్న క్రమంలో పటిష్టమైన నాయకత్వం చాలా అవసరం. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సదుపాయాలు హైదరాబాద్ నగర ప్రజలకు అందాలి. విశాల దృక్పథం కలిగిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నగర అభివృద్ధిలో ఎంతో అండగా ఉంటుంది. కరోనా కష్ట కాలంలోనే భారీ వరదలు వచ్చాయి. నగర ప్రజలు ఎంతగానో ఇబ్బందులు పాలయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఎలా విఫలమయ్యిందో ప్రజలు చూసారు. బీహార్ ఎన్నికలలోను, దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ వచ్చిన ఫలితాలను చూస్తే మోడీ నాయకత్వాన్ని ప్రజలు ఎంతగా విశ్వసిస్తున్నారో తెలుస్తుంది.

జి.హెచ్.ఎం.సి. ఎన్నికలకు సంబంధించి జనసేన, బీజేపీలు కలిసి చర్చించుకోవాలని భావించాయి. ఇంతలోనే షెడ్యూల్ వచ్చింది. ఇరు పార్టీల మధ్య పోటీ విషయంలో కొంత మేరకు గందరగోళం నెలకొంది. అయితే హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్నాం. డా.లక్ష్మణ్ , కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తో ఎప్పటి నుంచో పరిచయం ఉంది. వారిద్దరితో విస్తృత చర్చలు సాగించాం. విశాల ప్రజా ప్రయోజనాలను కాంక్షిస్తూ జి.హెచ్.ఎం.సి. ఎన్నికల వరకూ ఆగాలని నిర్ణయించాం. భవిషత్తులోనూ కలసి పని చేస్తాం.2008 నుంచి నాతో కలసి పనిచేసిన క్యాడర్ ఉంది. అలాగే 2014 ఎన్నికల సమయంలోను, 2019 ఎన్నికల్లోనూ పార్టీ వెంట ఉన్న క్యాడర్ ఉంది. వారు జి.హెచ్.ఎం.సి. ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. వారు కొంత మేరకు నిరుత్సాహానికి లోనవుతారు. అయితే విస్తృత ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఇది. విభజన రాజకీయాలు ఉండకూడదు అని పేర్కొన్నారు.

Next Story
Share it