తెలంగాణలో మళ్ళీ బిజెపి, జనసేన పొత్తు
ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో కలపి పోటీచేస్తాం
ఎన్నిక ఎన్నికకూ ఓ విధానం
జనసేన అధికారిక ప్రకటన
జనసేన శ్రేణులను అవమానించారంటూ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అనూహ్యంగా టీఆర్ఎస్ బరిలో నిలిపిన పీ వీ కుమార్తె వాణికి మద్దతు ప్రకటించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకింత కలకలం రేపారు. దీనిపై బిజెపి నేతలు కూడా విస్తుపోయారు. కానీ మళ్ళీ తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక దగ్గరకు వచ్చేసరికి బిజెపికి మద్దతుగా ప్రచారం కూడా నిర్వహించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు సడన్ గా తెలంగాణలో కలసి పనిచేయాలని నిర్ణయించినట్లు జనసేన అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఇది చూసిన వారంతా విస్తుపోవాల్సిన పరిస్థితి. ఎన్నిక ఎన్నికకూ ఓ విధానం అన్న చందంగా తయారైంది జనసేన పరిస్థితి. బిజెపి నేతలు కూడా తమకు అసలు తెలంగాణలో ఎవరితో పొత్తు ఉండదని గతంలో ప్రకటించారు. కానీ జనసేన మాత్రం పొత్తు ఉంటుందని ప్రకటించటం విశేషం. జనసేన తాజా ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి...'తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని జనసేన, భారతీయ జనతా పార్టీలు నిర్ణయించాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన నాయకులు బీజేపీ నాయకులతో చర్చలు జరిపారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ లో కలిసి పోటీ చేయడం మీద ఇరు పార్టీల నేతల మధ్య స్థూలంగా ఒక ఒప్పందం కుదిరింది. ఎవరెవరు ఎక్కెడెక్కడ పోటీ చేయాలనేది మరోసారి జరిగే చర్చల్లో నిర్ణయం జరుగుతుంది.
ఈ చర్చల్లో జనసేన పార్టీ తరఫున పార్టీ తెలంగాణ ఇంఛార్జు శంకర్ గౌడ్, పూర్వపు ఖమ్మం జిల్లా పార్టీ ఇంఛార్జు రామ్ తాళ్ళూరి, పార్టీ కార్యనిర్వహక కార్యదర్శి వి.వి.రామారావు, బీజేపీ తరఫు నుంచి పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు చింతల రామచంద్రారెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి ఈ చర్చల్లో పాల్గొన్నారు.' అని తెలిపారు. మరి ఈ పొత్తు వ్యవహారంపై బిజెపి తెలంగాణ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే. ఖమ్మం, వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు పలు మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రకటనలోనూ ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కలసి పోటీచేస్తామని ప్రకటించారు తప్ప..మిగిలిన వాటి అంశాలను ఎక్కడా ప్రస్తావించకపోవటం విశేషం.