Telugu Gateway
Politics

ఉప రాష్ట్ర‌ప‌తి గురించి మ‌మ‌త‌కు ముందే చెప్పారా?!

ఉప రాష్ట్ర‌ప‌తి గురించి మ‌మ‌త‌కు ముందే చెప్పారా?!
X

అనూహ్యం. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ, ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ జగదీప్‌ ధన్‌కర్‌ల మ‌ధ్య ప‌రిస్థితి ఉప్పు-నిప్పు త‌ర‌హాలోనే ఉంట‌ద‌నే విష‌యం తెలిసిందే. గ‌తంలో ఇద్ద‌రూ ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేసుకున్నారు. అంతే కాదు..ఏకంగా మ‌మ‌తా బెన‌ర్జీ అయితే ఆయ‌న సోష‌ల్ మీడియా ఖాతాల‌ను బ్లాక్ చేయ‌టంతోపాటు ఓ సారి అసెంబ్లీలో ఆయ‌న‌కు కొన్ని చోట్ల ప్ర‌వేశం కూడా లేకుండా చేశారు. దీనిపై ఇద్ద‌రూ ఒకరిపై ఒక‌రు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేసుకున్నారు. తాజాగా డార్జిలింగ్ లో పశ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మమ‌తా బెన‌ర్జీ, అస్సాం సీఎం హిమంత బిశ్వ‌శ‌ర్మ‌లు క‌లిశారు. అక్క‌డే ప‌శ్చిమ బెంగాల్ గ‌వ‌ర్న‌ర్ జగదీప్‌ ధన్‌కర్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ స‌మావేశం సీన్ చూస్తే ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధిగా జగదీప్‌ ధన్‌కర్ ను రంగంలోకి దింపుతున్న‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీకి ముందే చెప్పారా అన్న చ‌ర్చ సాగుతుంది ఇప్పుడు. అస‌లు ఉప్పు-నిప్పులా ఉండే వీరిద్ద‌రూ అంత ప్ర‌శాంతంగా క‌లుసుకోవ‌టం వెన‌క కార‌ణాలు ఏమై ఉంటాయా అన్న చర్చ సాగింది.

ఇప్పుడు దానికి ఓ క్లారిటీ వ‌చ్చిన‌ట్లే అని భావిస్తున్నారు. శ‌నివారం సాయంత్రం బిజెపి పార్ల‌మెంట‌రీ పార్టీ బోర్డు స‌మావేశం అనంతరం ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ ధన్‌కర్ పేరును ప్రకటించారు. ఆయ‌న వ‌య‌స్సు 71 సంవ‌త్స‌రాలు. జగదీప్‌ ధన్‌కర్‌ పేరును ఖరారు చేస్తూ అధికారికంగా బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన చేశారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవికాలం ఆగష్టు 10వ తేదీతో ముగియనుంది. షెడ్యూల్‌ ప్రకారం.. ఆగష్టు 6వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగాలి. నామినేషన్ల దాఖ‌లుకు తుది గడువు జులై 19వ తేదీ. మ‌రి ఇప్పుడు యూపీఏ కూట‌మి ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌కు కూడా అభ్య‌ర్ధిని బ‌రిలో నిలుపుతారా లేదా అన్న‌ది వేచిచూడాల్సిందే. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధి ద్రౌప‌ది ముర్ము విష‌యంలో సామాజిక న్యాయం కోసం అంటూ ప‌లు పార్టీలు ఆమెకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. మ‌రి ఇప్పుడు ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్ధికి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు ఏ వాద‌న‌ను తెర‌పైకి తెస్తారో వేచిచూడాల్సిందే. రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ఆదివాసీ మ‌హిళ‌కు ఇచ్చినందున..ఉప రాష్ట్ర‌ప‌తి ముస్లిం మైనారిటీకి ఇవ్వొచ్చ‌ని జోరుగా ప్ర‌చారం సాగింది. అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌కిందుల చేస్తూ జ‌గ‌దీప్ ద‌న‌ఖ‌ర్ పేరును ప్ర‌కటించారు.

Next Story
Share it