ప్రత్యేక హోదా..విభజన హామీల సాధనలో జగన్ విఫలం
తెలుగుదేశం పార్టీ ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు గుప్పించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ స్వప్రయోజనాల కోసమే ఈ పర్యటన తలపెట్టారని ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామక్రిష్ణుడు వ్యాఖ్యానించారు. . మూడు రాజధానుల పేరుతో విధ్వంస రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇడుపులపాయకే పరిమితమైన ఉన్మాదాన్ని రాష్ట్రం మొత్తం విస్తరిస్తున్నారన్నారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రానికిఆదాయం లేకపోవడంతో లక్షలాది కోట్లు అప్పులు చేస్తున్నారని, ఇది చాలదన్నట్లు ప్రభుత్వ ఆస్తులను తనాఖా పెట్టే స్థితికి దిగజారారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భవనాలు, స్థలాలను తనఖా పెట్టి రూ.5వేల కోట్లు సమీకరించాలని భావించడం జగన్ రెడ్డి అసమర్థ విధానాలకు నిదర్శనమని యనమల రామకృష్ణుడు విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తన అక్రమ సంపద 43వేల కోట్ల రూపాయలను ప్రభుత్వ ఖజనాకు జమచేస్తే రెవెన్యూలోటు ఉండదన్నారు. బెయిల్ రద్దవుతుందనే భయంతో ఢిల్లీ పెద్దల ముందు సాష్టాంగపడుతున్నారని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాతో సహా విభజన చట్టంలో అంశాల అమలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో జగన్మోహన్‌రెడ్డి ఘోరంగా విఫలమయ్యారని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర సమస్యలను జగన్ రెడ్డి ఏనాడూ పట్టించుకోలేదన్నారు. వైసీపీ ఎంపీలు ఏనాడూ పార్లమెంట్‌లో నోరెత్తలేదని యనమల తెలిపారు. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా సాధిస్తానని ఊరూరా తిరిగి ప్రచార చేశారని... ప్రత్యేక హోదా తెస్తామని ఓట్లు పొందారని, ఇప్పుడు ప్రజల గొంతు కోశారని మండిపడ్డారు. 25 మందికి 25 ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానన్న మాట ఏమైందని ప్రశ్నించారు. 28 మంది ఎంపీలు ఉన్నప్పటికీ మూగనోము పాటిస్తున్నారని విమర్శించారు. కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద మెడలు దించారన్నారు. హోదా వస్తే ఒంగోలు కూడా హైదరాబాద్‌లా తయారు అవుతుందనే మాటలు మర్చిపోయారా అని నిలదీశారు. ప్రత్యేక హోదా వస్తేనే పెట్టుబడులు, ఉద్యోగాలు, నిధులు వస్తాయని యువతకు చెప్పిన జగన్ రెడ్డి.. నేడు వారికి నమ్మకద్రోహం చేశారన్నారు. ఎందుకు ప్రత్యేక హోదాను కేంద్రాన్ని అడగలేకపోతున్నారని ప్రశ్నించారు.