మాకే ప్రజాస్వామ్య పాఠాలు చెబుతారా?
కేంద్రం..ట్విట్టర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయిన భారత్ కే ట్విట్టర్ పాఠాలు చెబుతుందా అంటూ కేంద్రం ఈ సంస్థపై మండిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన కొత్త ఐటి నిబంధనలు భావ ప్రకటనా స్వేచ్ఛకు ప్రమాదం కలిగించేలా ఉన్నాయన్న ట్విటర్ వ్యాఖ్యలను ఖండించింది. ట్విట్టర్ బెదిరింపు వ్యూహాలతో కూడిన నిరాధార ఆరోపణలు చేసిందని ఐటీ శాఖ వ్యాఖ్యానించింది. ట్విటర్ ఉద్దేశ్యపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘిస్తోందని ఐటీశాఖ ఆరోపించింది. భారత న్యాయ వ్యవస్థను దెబ్బతీయాలని ట్విటర్ చూస్తోందని కేంద్రం వ్యాఖ్యానించింది. 'కాంగ్రెస్ టూల్‌కిట్'పై బీజేపీ నేతల పోస్ట్ లకు ట్విటర్ ''మానిప్యులేటెడ్ మీడియా'' అని ట్యాగ్ చేసింది. ఈ ట్యాగ్‌ను తొలగించాలని ప్రభుత్వం కోరింది.
దీనిపై నోటీసులు ఇచ్చేందుకు ఢిల్లీ పోలీసులు ఢిల్లీ, గురుగ్రామ్‌లలోని ట్విటర్ ఇండియా కార్యాలయాలకు మే 24న సాయంత్రం వెళ్ళారు. ఈ నేపథ్యంలోనే ట్విటర్, ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. 'కాంగ్రెస్ టూల్ కిట్' వ్యవహారంలో ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని, పోలీసుల చేత బెదిరించే ఎత్తుగడలకు పాల్పడుతోందని ఆరోపించింది. భావ ప్రకటనా స్వేఛ్చకు ముప్పు ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. చట్టం పప్రకారం తాము నడుచుకుంటామని అంటూనే తీవ్ర పదజాలంతో ప్రభుత్వంపై విరుచుకుపడింది. మరో వైపు వాట్సప్ కూడా సర్కారు తీరుపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టును ట్విట్టర్ ఆశ్రయించిన విషయం తెలిసిందే.