Telugu Gateway
Politics

ష‌ర్మిల పార్టీలో అప్పుడే రాజీనామాలు

ష‌ర్మిల పార్టీలో అప్పుడే రాజీనామాలు
X

వైఎస్ ష‌ర్మిల పార్టీలో అప్పుడే లుక‌లుక‌లు. కొద్ది రోజుల క్రిత‌మే పార్టీలో ప‌ద‌వులు అమ్ముకుంటున్నారంటూ కొంత మంది నేత‌లు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీలో చాలా క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇందిరా శోభ‌న్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ విష‌యాన్ని ఆమె శుక్ర‌వారం ఉద‌యం వెల్ల‌డించారు. ఓ లేఖ విడుద‌ల చేశారు. 'నన్ను ఆదరిస్తూ, అభిమానిస్తూ ప్రజాజీవితంలో ముందుకు నడిపిస్తున్న శ్రేయోభిలాషుల‌కు ధ‌న్య‌వాదాలు. తెలంగాణ ఉద్యమంలో రాష్ర్ట సాధన కోసం కలిసి కోట్లాడినం. తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని కలలుగన్నం. వాటిని సాకారం చేసుకునేందుకు ప్రజలతో మమేకమైన నన్ను.. మీరంతా ఆశీర్వదిస్తూనే ఉన్నారు. అందుకు జీవితాంతం మీకు రుణపడి ఉంటాం.

ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకున్నాను. అది మీరు కోరుకుంటున్నట్లుగానే షర్మిలక్క వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేశాను. అని తెలిపారు. 'భవిష్యత్తు కార్యాచరణను త్వరలో ప్రకటిస్తాను. ప్రజాజీవితంలోనే ఉంటా. జనం కోసమే కదులుతా. ప్రజల కోసమే అడుగులు వేస్తా. ఇదే ఆదరాభిమానాలను ఇక ముందు కూడా మీ నుంచి నాకు ఉంటాయని, నన్ను నడిపిస్తారని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నాను. ఇన్నాళ్లు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో నాకు సహకరించిన ప్రతీ నాయకుడికి, కార్యకర్తలకు పేరు పేరునా ధన్యవాదాములు' అని ఇందిరాశోభన్ తెలిపారు. అయితే ఆమె కాంగ్రెస్ లో చేరే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

Next Story
Share it