కాంగ్రెస్ కే క్లియర్ అంటున్న ఇండియా టుడే
దేశంలో తీవ్ర ఉత్కంఠ రేపిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చాయి. ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీ కే ఎడ్జ్ ఉన్నట్లు చెపుతున్నా...మరికొంత మంది మాత్రం బీజేపీ వైపు మొగ్గు చూపారు. కానీ ఇండియా టుడే..ఆక్సిస్ మై ఇండియా లు మాత్రం కర్ణాటక కాంగ్రెస్ పార్టీ దే అని స్పష్టంగా తేల్చి చెప్పాయి. ఈ రెండు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ కి 122 నుంచి 140 వరకు సీట్లు వస్తాయని పేర్కొంది. అదే బీజేపీ కి మాత్రం 62 నుంచి 80 సీట్లు వస్తాయని...జెడీఎస్ కు 20 నుంచి 25 వరకు వస్తాయని వెల్లడించింది. గత లోక్ సభ ఎన్నికల సమయంలో కూడా ఇండియా టుడే, ఆక్సిస్ మై ఇండియా అంచనాలు వాస్తవానికి చాలా చాలా దగ్గరగా ఉన్నాయి. దీంతో ఎక్కువ మంది కర్ణాటక విషయంలో కూడా వీటిని గమనంలోకి తీసుకోవచ్చు అని భావిస్తున్నారు. ఓటు షేర్ విషయానికి వస్తే కాంగ్రెస్ కు 43 శాతం, అధికార బీజేపీ కి 35 శాతం, జెడీఎస్ కు 16 శాతం రావొచ్చు అని పేర్కొంది.
మే 13 న ఫలితాలు వెల్లడి కానున్నాయి. వచ్చే లోక్సభ సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భవిష్యత్ రాజకీయ మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ నిజం అయితే మాత్రం దేశంలో కాంగ్రెస్ పార్టీ పునర్జీవానికి ఇది ఎంతో ఉపయోగపడుంది అని ఆ పార్టీ నాయకులూ గట్టి నమ్మకం తో ఉన్నారు. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఎంతో కొంత ఈ ఫలితాల ప్రభావం ఉంటుంది అని భావిస్తున్నారు. మరో రెండు రోజులు ఆగితే కానీ అసలు లెక్కలు ఏమిటి అన్నవి బయటకు రావు. అప్పటి వరకు ఎవరికీ వారు అసలా పల్లకిలో ఊరేగటమే.