కెసీఆర్ పాలనలో ప్రజలకే కాదు..దేవుళ్లకూ అన్యాయమే
సమ్మక్క-సారలమ్మను అవమానించిన కెసీఆర్
పన్నెండు నెలల్లో రాష్ట్రానికి పట్టిన కొరివి దెయ్యం పారిపోవటం ఖాయం
పోలీసులపై పరుష వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు
జగ్గారెడ్డి వ్యవహారం టీ కప్పులో తుఫాన్
రియల్ ఎస్టేట్ వ్యాపారి రామేశ్వరావు ముచ్చింతాల్ లో నిర్మించిన దేవాలయాల్లో పొర్లుదండాలు పెట్టిన ప్రధాని మోడీ, సీఎం కెసీఆర్ గిరిజనుల ఆరాధ్య దైవం అయిన సమ్మక్క-సారలమ్మ జాతర వైపు చూడకపోవటం సరికాదని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ధనవంతులు, పెట్టుబడిదారులు నిర్మించే ఆలయాలపై ఉన్న భక్తి..పేదలు, గిరిజనుల అమ్మవార్లపై లేదా?. అని ప్రశ్నించారు. మోడీ, కెసీఆర్ లు తన చర్యల ద్వారా ఈ ప్రాంతాన్ని అవమానించారన్నారు. . కెసీఆర్ పాలనలో ప్రజలకే కాదు..దేవుళ్లకు కూడా అన్యాయం జరుగుతోంది ఆరోపించారు. మహా అంటే మరో 12 నెలల్లో రాష్ట్రానికి పట్టిన కొరివి దెయ్యాన్ని వదిలిస్తామని వ్యాఖ్యానించారు. సమ్మక్క-సారలమ్మ ఆశీర్వాదంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని..తాము అధికారంలోకి వచ్చాక వెయ్యి కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన శనివారం నాడు పార్టీ నేతలతో కలసి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. సొంత రాష్ట్రం వస్తే అన్నీ బాగుంటాయన్న పరిస్థితి నుంచి మనం ఎన్నుకున్న పాలకులను చూసి మనం భయపడాల్సిన పరిస్థితి వచ్చింది.
భయం భయంగా బతకాల్సి వస్తోంది. అక్రమ అరెస్ట్ లు..అక్రమ నిర్భందాలు సాగుతున్నాయన్నారు. కోట్లాది మందికి స్పూర్తినిచ్చి..రాజ్యం..చక్రవర్తుల మీద పోరాటం చేసిన అక్కల జాతర జరిగితే సీఎం కెసీఆర్ కనీసం ఇటు వైపు కన్నెత్తి చూడలేదు. రియల్ ఎస్టేట్ సంస్థలు నిర్మించిన కట్టడాలకు దగ్గరకుపోతారు..పొర్లుడు దండాలు పెడతారు. ముచ్చింతాల్ కు వెళ్లిన పీఎం, సీఎంలు ములుగు రాలేరా? అని ప్రశ్నించారు. మోడీ, కెసీఆర్ లు సమ్మక్క-సారలమ్మలను అవమానించారన్నారు. పేదల దేవతలు అన్నా వీరికి చులకనే అన్నారు. ఈ దేవతలను అవమానించే అధికారం ఎవరిచ్చారు అని ప్రశ్నించారు. 2000 ఎకరాల భూమి కేటాయించి ఈ ప్రాంతాన్ని శాశ్వత పర్యాటక కేంద్రంగా మార్చాలన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడకు వచ్చారు కానీ..జాతరకు కేంద్రం కేటాయించిన 2.5 కోట్లు ఏ మూలకు సరిపోతాయన్నారు.
అత్యంత కీలకమైన పర్యాటక శాఖమంత్రిగా ఉన్న ఆయన సొంతంగా 300 నుంచి 400 కోట్ల రూపాయలు కేటాయించవచ్చని..కానీ ఆ పని చేయలేదన్నారు. వాళ్లకు ఆదివాసీల ఓట్లు కావాలి..ఈ ప్రాంతం ప్రగతి వారికి పట్టదన్నారు. కుంభమేళాను ఎలా జాతీయ పండగలా చేస్తారో..సమ్మక్క,, సారలమ్మ పండగను కూడా అలా చేయాలని డిమాండ్ చేశారు. కెసీఆర్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు కుక్కలు చింపిన విస్తరాకులా మారాయి. ఏ మండలాలు ఎక్కడ ఉన్నాయో..ఏ జిల్లాలో ఉన్నాయో ఎవరికీ తెలియదు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజల ఆకాంక్షల మేరకు, అవసరాలకు అనుగుణంగా కెసీఆర్ చేసిన గందరగోళాన్ని తొలగిస్తామన్నారు. ఇటీవల తాను పోలీసు ఉన్నతాధికారులతో పరుష వ్యాఖ్యలు చేశానని..అయితే కార్యకర్తలపై జరిగిన దాడులకు సంబంధించిన బాధతో అలా మాట్లాడాల్సి వచ్చింది తప్పమరో ఉద్దేశం లేదన్నారు. భవిష్యత్ లో అలా జరగకుండా చూసుకుంటానన్నారు. అయితే పోలీసులు కూడా ఎవరో చెప్పినట్లు కాకుండా న్యాయం వ్యవహరించాలన్నారు. జగ్గారెడ్డి విషయం టీ కప్పులో తుఫాన్ గా తేల్చేశారు.