Telugu Gateway
Politics

పార్టీ వద్దంటే..ఇవ్వాలే రాజీనామా చేస్తా

పార్టీ వద్దంటే..ఇవ్వాలే రాజీనామా చేస్తా
X

తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఆదేశిస్తే తన పదవికి తక్షణమే రాజీనామా చేస్తానని విజయవాడ ఎంపీ కేశినాని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ కోసమే పనిచేస్తున్నానని..తాను పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నానని భావిస్తే నిర్ణయం తీసుకోవాల్సింది కూడా అధిష్టానమే అన్నారు. అధిష్టానం తాను తప్పుచేసినట్లు భావిస్తే సస్పెండ్ చేయవచ్చని..టెర్మినేట్ చేయవచ్చని అన్నారు. పార్టీ ఆదేశిస్తే ఇంకా రెండున్నర సంవత్సరాలు ఉన్న ఎంపీ పదవిని వదులుకోవటానకి కూడా రెడీ అన్నరు. ఫోన్ లో చెప్పినా రాజీనామా లేఖను వెంటనే స్పీకర్ కు పంపిస్తానని తెలిపారు. కేశినేని నానిపై విజయవాడకు చెందిన నేతలు బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధా వెంకన్న, నాగులుమీరాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తీవ్ర స్థాయిలో ఉన్న ఈ విభేదాలు ఎన్నికల్లో ప్రభావం చూపించవా అని కేశినేని నానిని మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే ..'ప్రజలు క్లారిటీతో ఉన్నారు. ఐదేళ్ల చంద్రబాబు పాలన..జగన్ పాలన ఎలా ఉందో వాళ్లు చూస్తున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 40 నుంచి 50 స్థానాలు గెలవటం ఖాయం. ఇది నా సవాల్. అది వైసీపీ వాళ్లు ..ఎవరైనా అవోచ్చు. నాకు ఎవరితో విభేదాలు లేవు.

నాపై విమర్శలు చేసే వాళ్ళకు ఏమి బాధలు ఏమి ఉన్నాయో నాకు తెలియదు కదా?. నాకు తెలియకుండా ఉన్న బాధలు ఏమో ఉండి ఉండొచ్చు. ఏమైనా ఉంటే చంద్రబాబు చూస్తారు. అది నా స్థాయి కాదు. ఎవరి అభిప్రాయం వారికి ఉండొచ్చు. ఇది ప్రజాస్వామ్యం. మిలటరీ రూల్ కాదు..డిక్టేటర్ షిప్ కాదు. రూట్ మ్యాప్ మార్చింది నేను కాదు. పార్టీ ఆర్గనేషన్ వేరు..నేను ప్రజలు ఎన్నుకున్న ఎంపీని. ఎంపీగా నా బాధ్యత నేను చూస్తున్నా. నా గెలుపునకు కారణమైందే బీసీలు, ఎస్సీలు, మైనారిటీలు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు అని వారు నా వెనక ఉన్నారు. నేను ఎప్పుడూ తప్పుచేయనని నా ప్రగాఢ నమ్మకం. నేను ఎవరిపైనా ఫిర్యాదు చేయబోను. విమర్శలను, వ్యాఖ్యలను వారి విచక్షణకు వదిలేస్తున్నానన్నారు. సీట్ల కేటాయింపులో తాను విభేదించింది కూడా బ్రాహ్మణ, బీసీ సీట్ల కోసమేనన్నారు. చంద్రబాబు ఎవరికి ఎంపీ టిక్కెట్ ఇస్తే వారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారు' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it