ముందు విచారణ జరగాలి..తర్వాతే రాజీనామా సంగతి
ఆస్తుల కోసం..పదవుల కోసం ఈటెల లొంగిపోడు
సిట్టింగ్ జడ్జి..సీబీఐతో సహా ఏ విచారణ అయినా రెడీ
కొన్ని ఛానళ్ళు పెయిడ్ మీడియాలా వ్యవహరించాయి
ఆత్మగౌరవం ముఖ్యం..పదవులు కాదు
తెలంగాణా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఈ భూమి మీద ఉన్న ఏ సంస్థతో అయినా విచారణ జరిపించుకోవచ్చన్నారు. సిట్టింగ్ జడ్జీతోపాటు సీబీఐ విచారణ అయినా ఓకే అన్నారు. తనకు పదవుల కంటే ఆత్మాభిమానం..ఆత్మ గౌరవమే ముఖ్యమన్నారు. తనపై విచారణ పూర్తయిన తర్వాతే మంత్రి పదవికి రాజీనామా అంశంపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. తన మొత్తం చరిత్ర, తన మొత్తం ఆస్తులపై విచారణ జరిపించుకోవచ్చన్నారు. తప్పు చేసినట్లు తేలితే ఏ శిక్షకు అయినా సిద్ధం అన్నారు. సీఎం కెసీఆర్ ప్రకటన చూశానని...ఎస్ ..సీఎస్ కమిటీ కూడా విచారణ జరగాల్సిందేనన్నారు. ఈటెల రాజేందర్ నిప్పు అని వ్యాఖ్యానించారు. తాను అసైన్ మెంట్ భూములు కబ్జా చేసినట్లు వచ్చిన ఆరోపణలను మంత్రి తోసిపుచ్చారు. తన పౌల్ట్రీకి అవసరమైన భూములు కావాలనే విషయాన్ని సీఎం కెసీఆర్, సీఎంవోలోని అధికారి నర్సింగరావు, టీస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళ్ళానన్నారు. తన పౌల్ట్రీ చుట్టూ అసైన్ మెంట్ భూములు ఉన్న విషయం చెపితే ప్రభుత్వం సేకరించాలంటే జాప్యం అవుతుంది కాబట్టి..రైతులే సరెండర్ చేస్తే తీసుకోవచ్చని తెలిపారన్నారు. ఆ మేరకు ఎమ్మార్వోకు వాళ్లు లేఖలు ఇచ్చారన్నారు.
కొన్ని మీడియా ఛానళ్లు పక్కా స్కెచ్ ప్రకారం, పథకం ప్రకారం తనపై బురద జల్లే ప్రయత్నం చేశాయన్నారు. ఇవి పూర్తిగా పెయిడ్ చానళ్లుగా వ్యవహరించాయని ఆరోపించారు. వాళ్లు చేసింది ఇన్వెస్టిగేషన్ స్టోరీలు కాదన్నారు. ఓ పథకం ప్రకారం..ప్లాన్ ప్రకారం ఇది సాగిందని మంత్రి మండిపడ్డారు. ఈటెల మీడియా సమావేశంలోని మరికొన్ని ముఖ్యాంశాలు...'అత్మగౌరవాన్ని నమ్ముకున్న బిడ్డను. పౌల్ట్రీని నమ్ముకున్న బిడ్డను. ఒకే జనరేషన్ లో వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అయినా వాళ్ల గురించి మాట్లాడను.
దొరలకు వ్యతిరేకంగా కొట్లాడినవాడిని. దొరలకు లొంగేవాడిని కాను. కొంత మంది వంద కోట్లతో పరిశ్రమ పెడితే వాళ్లకు వంద కోట్ల రూపాయల రాయితీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మేం ఫౌల్ట్రీ విస్తరణకు భూమి కావాలని ప్రభుత్వంలో అందరికీ చెప్పాం. ఇలాంటి చిల్లరమల్లర ప్రయత్నాలకు ఈటెల రాజేందర్ లొంగిపోడు. ఆస్తుల కోసం..అంతస్తుల కోసం..పదవుల కోసం లొంగిపోయే రకం కాదు. ఆత్మగౌరవం..అత్మాభిమానం కంటే పదవి గొప్పది కాదు. నా నియోజకజవర్గంలో ఏ ఇంటి తలుపు తట్టినా నా గురించి చెబుతారు. ప్రలోబాలు పెట్టి గెలవలేదు. కులం పేరు., మతం పేరు చెప్పలేదు. ఎవరి చరిత్ర ఏందో నాకు తెలుసు. ఆరోపణలు చేస్తున్న వారి భూమి ఎలా ఉంటదో ఓ సారి మీడియా వెళ్లి చూసిరావాలి. స్కెచ్ గీసుకుని..నా క్యారెక్టర్ దెబ్బతీసే కుట్ర చేశారు. అంతిమంగా న్యాయానిదే విజయం, తాత్కాలికంగా అన్యాయం గెలవొచ్చు. ' అంటూ వ్యాఖ్యానించారు.