టీఆర్ ఎస్ టిక్కెట్ నాదే అంటున్న కౌషిక్ రెడ్డి!
హుజూరాబాద్ రాజకీయాలు రసకందాయంలో పడుతున్నాయి. కాంగ్రెస్ నేత కౌషిక్ రెడ్డికి సంబంధించిన ఆడియో ఒకటి సోమవారం నాడు పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. అందులో ఆయన మాటల ప్రకారం చూస్తే టీఆర్ఎస్ టిక్కెట్ తనకే ఖరారు అయిందని..తనకు యువత జాబితా కావాలని..వారికి అవసరమయ్యే ఖర్చులు అన్నీ తాను చూసుకుంటానని ఓ యువకుడితో చెప్పారు. గంటన్నరలోనే తనకు జాబితా కావాలని..అంతా తాను చూసుకుంటానని ప్రకటించారు. ఈవ్యవహారం కలకలం రేపింది. కౌషిక్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు.
ఆ పార్టీ టిక్కెట్ పైనే పోటీచేస్తారని అంతా భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆడియో వ్యవహారం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈటెల రాజేందర్ టీఆర్ఎస్ ను వీడినప్పటి నుంచి ఆయన్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేస్తూ కౌషిక్ రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. ఆయన పెద్ద ఎత్తున అవినీతి చేశారని..సీఎం కెసీఆర్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కొద్ది రోజుల క్రితం మంత్రి కెటీఆర్ తో కూడా సమావేశం అయ్యారు. అయితే దీనిపై దుమారం రేగగా..తాను ఓ వేడుక సందర్భంగానే తాను కెటీఆర్ ను కలిశానని..అంతే తప్ప మరొకటి కాదని చెప్పారు.