కెసీఆర్ అహంకారం వర్సెస్ ఈటెల మధ్యే ఎన్నిక
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి కెసీఆర్ అహంకారానికి, తన మద్య పోటీయే అన్నారు. మరోసారి దళితులను మోసం చేసేందుకు దళిత బంధు పథకం తెరపైకి తెచ్చారని విమర్శించారు. పాదయాత్రలో భాగంగా ఆయన బుధవారం నాడు జమ్మికుంట మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అహంకారం, నిరంకుశత్వం వల్లే ఉప ఎన్నిక జరుగుతోందని పేర్కొన్నారు.
దమ్ముంటే రాజీనామా చేయాలని కేసీఆర్ బానిసలు అన్నారని... అందుకే రాజీనామా చేసి వచ్చానన్నారు. 'నన్ను గడ్డి పోస అనుకున్నారు.. కానీ గడ్డపార లెక్క తయారు అయ్యాను. దళిత బందును దళిత మేథావులు నమ్మడం లేదు' అని ఈటల పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం రాజకీయం అంతా హుజూరాబాద్ చుట్టూనే తిరుగుతోంది. అధికార టీఆర్ఎస్ కూడా ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలు వరాలు కురిపిస్తోంది.