దేశంలో ఖరీదైన ఉప ఎన్నికగా హుజూరాబాద్
ఉద్యోగాల గురించి మాట్లాడినందుకు నిరోష అనే మహిళపై టీఆర్ఎస్ నేతలు, పోలీసులు దాడి చేశారని టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి విమర్శించారు. హరీష్ రావు సభలో ఉద్యోగాల గురించి అడిగినందుకే ఇలా చేశారన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం దారుణంగా ఉందని మండిపడ్డారు. బాధిత మహిళ నిరోషతో కలసి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ ను కలసి వినతిపత్రం అందజేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే హుజూరాబాద్ ఉప ఎన్నిక అత్యంత ఖరీదైన ఎన్నికగా మారబోతుందని పేర్కొన్నారు.
హరీష్ రావు, ఈటెల రాజేందర్ లు అన్ని రకాల నిబంధనలను తుంగలో తొక్కారని ఆరోపించారు. నిరుద్యోగ యువతపై టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతోందని..ఇది ఏ మాత్రం సరికాదన్నారు. ప్రశ్నించే వారిపై దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. హుజూరాబాద్ లో అటు టీఆర్ఎస్, ఇటు బిజెపిలు వందల కోట్ల రూపాయలు వెదజల్లుతున్నాయని విమర్శించారు. ఒక వ్యూహం ప్రకారమే దళిత బంధు ఆపారని,, ఎన్నికల సమయంలో రైతు బంధు పడగా లేనిది..దళిత బంధు ఇస్తే ఏమి అవుతుందని ప్రశ్నించారు.