Telugu Gateway
Politics

హుజూరాబాద్..ఈటెల‌కే కాదు..బిజెపికీ బిగ్ ఛాలెంజ్

హుజూరాబాద్..ఈటెల‌కే కాదు..బిజెపికీ బిగ్ ఛాలెంజ్
X

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన పదవికి రాజీనామా చేసి ఇంకా పది రోజులు కూడా కాలేదు. కానీ అప్పుడే నేతల మోహరింపు మొదలైంది. అధికార పార్టీ యమా స్పీడ్ మీద ఉంది. ఇప్పటికే కోట్లాది రూపాయల పనులకు జీవోలు ఇచ్చేసింది. మంత్రులు..నేతలు అక్కడే మకాం వేసి గెలుపు ప్లాన్ సిద్ధం చేస్తున్నారు.. టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పిన ఈటెల రాజేందర్ కూడా గురువారం నాడు రంగంలోకి దిగారు. ఆయనతోపాటు ఆయన భార్య కూడా ప్రచారపర్వంలోకి దూకేశారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అంటే బిజెపిలో చేరాక ఈటెల తొలిసారి హుజూరాబాద్ చేరుకున్నారు. ఆయనకు కార్యకర్తల నుంచి ఘనస్వాగతమే లభించింది. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావటంతో సహజంగానే ఈటెలకు అక్కడ మంచి పట్టు ఉంది. ఎలాగైనా ఈ పట్టును తప్పించి పార్టీయే సుప్రీమ్..వ్యక్తులు కాదు అని చెప్పాలనే తహతహలో ఉంది టీఆర్ఎస్. అందుకే మంత్రులు..ఎమ్మెల్యేలు..ఇతర నేతలను కూడా బాధ్యతలు అప్పగిస్తోంది

ఈటెల రాజీనామాకు ముందే ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అధికార పార్టీ ఈ ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకప్పుడు గులాబీ జెండాకు ఓనర్లం మేమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినా..ఇప్పుడు ప్రగతి భవన్ కాదు అది..బానిస భవన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఈటెల రాజేందర్ మాత్రమే. అత్యంత శక్తివంతమైన నేతగా ఉన్న కెసీఆర్ పై ఈ స్థాయి లో ఎటాక్ చేసింది ఈటెలనే. అది కూడా సొంత పార్టీలో అత్యంత కీలక నేతగా ఉన్న వ్యక్తి కావటంతో ఈటెల వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. దీంతోపాటు తెలంగాణలోఅత్యంత కీలకమైన బీసీ సామాజికవర్గానికి చెందిన నేత కావటం కూడా రాజకీయంగా కొత్త చర్చకు తెరతీసింది.

వాస్తవానికి ఈటెల రాజేందర్ తొలుత సొంత పార్టీ పెడతారని ప్రచారం జరిగినా ఆయన అనూహ్యంగా బిజెపిలో చేరారు. అయితే హుజూరాబాద్ నియోజకవర్గంలో బలం ఈటెల రాజేందర్ దే కానీ..బిజెపిది ఏ మాత్రం కాదు. అయితే ఇక్కడ గెలుపు ఈటెల రాజేందర్ కే కాదు..బిజెపికి కూడా అత్యంత కీలకంగా మారనుంది. పార్టీ మారిన ఈటెల రాజేందర్ తన సీటును నిలబెట్టుకోగలిగితేనే వచ్చే సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి కనీసం టీఆర్ఎస్ ఢీకొట్టగలదనే నమ్మకం ఇవ్వగలదు. లేదంటే ఎన్నికలకు ముందే ఆ పార్టీపై ఆశలు సన్నగిల్లుతాయనే చెప్పొచ్చు. అందుకే టీఆర్ఎస్, ఈటెల రాజేందర్ లు ఇంత ముందు నుంచే ఎన్నికల రంగంలోకి దూకారు.

Next Story
Share it