Telugu Gateway
Politics

'అఖిలపక్ష నేతల చేరికలూ' టీఆర్ఎస్ కు అక్కరకు రాలే!

అఖిలపక్ష నేతల చేరికలూ టీఆర్ఎస్ కు  అక్కరకు రాలే!
X

అధికార బ‌లం. ఆర్ధిక బ‌లం. చేతిలో అధికార యంత్రాంగం. ఇవే కాదు..ద‌ళిత‌బంధులాంటి బ్ర‌హ్మ‌స్త్రం. అన్ని పార్టీల్లో ఉన్న నేత‌ల‌ను టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నుంచి కౌశిక్ రెడ్డి. బిజెపి నుంచి ఇనుగాల పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు. తెలంగాణ తెలుగుదేశం నుంచి అయితే ఏకంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ లు కారెక్కారు. ఇది అంతా కూడా ఈటెల రాజేందర్ రాజీనామా ఎపిసోడ్ జరిగిన తర్వాతి పరిణామాలే. ఒక కీలక బీసీ నేత పార్టీ నుంచి బయటకు పోయారు కాబట్టి మాజీ మంత్రి..పార్టీ అధ్యక్షుడుగా ఉన్న ఎల్. రమణను టీఆర్ఎస్ లోకి చేర్చుకున్నారు. పైన చెప్పిన చేరికలు అన్నీ కేవలం హూజూరాబాద్ ఉప ఎన్నిక కోణంలో జరిగినవే. విచిత్రం ఏమిటంటే వీరంతా గతంలో కెసీఆర్ పై తీవ్రమైన విమర్శలుచేసిన వారే. తమ రాజకీయ అవసరాల కోసం కారెక్కారు. మాజీ మంత్రి, సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు అయితే దళితబంధు విషయంపై సీఎం కెసీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదే మోత్కుపల్లి నర్సింహులు కొంత కాలం క్రితం అంబేద్కర్ జయంతి రోజు కూడా ఆయనకు దండ వేయటానికి సీఎం కెసీఆర్ బయటకు రాలేదని అంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

కానీ దళిత బంధు ప్రకటన చేసిన తర్వాత ఆయన యూటర్న్ తీసుకుని కెసీఆర్ ను ఎవరూ పొగడని స్థాయిలో పొగడ్తలు కురిపించారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి పార్టీలోకి వస్తే హుజూరాబాద్ లో కలసి వస్తుందని భావించారు. అయితే తాజాగా వెల్లడైన ఫలితాలను బట్టి చూస్తే ఈ చేరికలు ఏవీ కూడా అధికార టీఆర్ఎస్ కు కలసివచ్చినట్లు కన్పించటం లేదు. పార్టీలో చేరిన వాళ్లు వీరు అయితే..పార్టీతో తమకు ఏ మాత్రం సంబంధం లేదంటూ బీసీ సంఘాల నేత కృష్ణయ్య కూడా టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు గెల్లు శ్రీనివాసయాదవ్ ను గెలిపించాలని మీడియా సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. బీసీ బిడ్డ కాబట్టే గెల్లుకు మద్దతు ఇస్తున్నామని..ఈటెల రాజేందర్ బీసీనో..రెడ్డినో ఆయనే తేల్చుకోవాలని వ్యాఖ్యానించారు. ఇన్ని చేరికలు...ఇంత మంది మద్దతు ప్రకటనలు చేసినా అవి ఏవీ కూడా టీఆర్ఎస్ కు ఉపయోగప‌డిన‌ట్లు క‌న్పించ‌టం లేదు. అంటే అక్కడ ఈటెల రాజేందర్ పై అభిమానం అలా ఉందా? లేక టీఆర్ఎస్ పై...ముఖ్యమంత్రి కెసీఆర్ పై వ్యతిరేకత ఆ రేంజ్ లో ఉందా?.

Next Story
Share it