Telugu Gateway
Politics

కెసీఆర్ ను న‌మ్మెదెలా?

కెసీఆర్ ను న‌మ్మెదెలా?
X

ద‌ళిత బంధు అమ‌లుకు సంబంధించి ముఖ్య‌మంత్రి కెసీఆర్ మాట‌లు న‌మ్మేది ఎలా అని సీఎల్పీ నేత మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క వ్యాఖ్యానించారు. చూస్తుంటే ఇది కూడా గ‌తంలో ఇచ్చిన హామీల త‌ర‌హాలోనే ఉంద‌ని అనుమానం వ్య‌క్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ వైఖ‌రి రాష్ట్రంలోని ద‌ళితులు అంద‌రికీ ఈ ప‌థ‌కం వ‌ర్తింప‌చేయాల‌న్న‌దే అన్నారు. రాష్ట్రంలో 18 లక్షల కుటుంబాలకు కావలసిన లక్ష ఏన‌భై వేల కోట్ల రూపాయల‌ను రాష్ట్ర బడ్జెట్ లో ప్రవేశ పెట్టకుండా.. నిధులు కేటాయించకుండా.. దళిత బంధు ఇస్తాను అంటే ఎలా నమ్మాలన్నారు. ఆత్మ గౌరవంతో తల ఎత్తుకుని బతకాలని, ఈ రాష్ట్రంలోని సహజ వనరులు అందరికి పండాల‌ని సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారు.

అయితే తెలంగాణ ఏర్పడ్డాక ఈ ప్రభుత్వంలో నిధులు దుర్వినియోగం అవడమే కాకుండా, ప్రశ్నించే వాళ్ళను బతికుండేందుకు వీల్లేకుండా నిరంకుశ పాలన చేస్తున్న కేసీఆర్ కు బుద్ది చెప్పాల‌న్నారు. ముష్టి నాలుగు మండలాలు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేస్తే అందులో వచ్చేది 10 వేల మంది మాత్రమే. వాళ్లకు రూ.10 లక్షలు ఇచ్చి దళితులకు మేలు చేస్తాం అంటే నమ్మి మోసపోయేందుకు ఇక్కడ ఎవరూ సిద్ధంగా లేర‌ని అన్నారు. మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క గ‌జ్వేల్ లో జ‌రిగిన ద‌ళిత, గిరిజ‌న దండోరా స‌భ‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Next Story
Share it