మోడీపై సోరేన్ విమర్శలు..జగన్ కౌంటర్
ప్రధాని మోడీ దేశంలో కరోనా నియంత్రణ విషయంలో ఘోరంగా విఫలం అయ్యారు అంటూ ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశీయ మీడియా సంగతి పక్కన పెడితే అంతర్జాతీయ మీడియా మాత్రం మోడీ తీరును తీవ్రంగా తప్పుపడుతోంది. అంతే కాదు..అత్యంత కీలకమైన వ్యాక్సినేషన్ విషయంలోనూ అంతా గందరగోళం చేసి పెట్టారు. ధరల విషయంలో కేంద్రానికి ఓ రేటు..రాష్ట్రాలకు ఓ రేటు..ప్రైవేట్ ఆస్పత్రులకు మరో రేటు అంటూ నిర్ణయాలు తీసుకుని తీవ్ర విమర్శల పాలు అయ్యారు. దేశ వ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన వ్యాక్సినేషన్ ను పూర్తి చేసి తదుపరి దశల కరోనాను అడ్డుకోవాల్సిన కేంద్రం ఈ దిశగా సరైన ప్రణాళికను రూపొందించలేదనే విమర్శలు ఎదుర్కొంటున్నారు మోడీ. సెకండ్ వేవ్ పై కూడా ముందే హెచ్చరికలు చేసినా కేంద్రం పట్టించుకోలేదనే నిపుణులు విమర్శిస్తున్నారు.
స్వయంగా బిజెపికి చెందిన రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి కూడా కరోనా విషయంలో పీఎంవోను నమ్ముకుంటే మునిగిపోతారని..కరోనా బాధ్యతను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి అప్పగించాలంటూ సూచించి కలకలం రేపారు. ప్రధాని మోడీ గురువారం రాత్రి పలువురు ముఖ్యమంత్రులతో కరోనా నియంత్రణ , రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడారు. ఇందులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ తోపాటు ఒడిశా, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులూ ఉన్నారు. దీనిపై స్పందించిన జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ తాజాగా ప్రధాని నరేంద్రమోడీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మోడీ ఈ చర్చల్లో ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు తప్ప..తాము చెప్పే మాటలను కూడా విని ఉంటే ఉంటే బాగుండేదని ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ చేసిన ట్వీట్‌పై ఏపీ సీఎం జగన్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ''హేమంత్ సోరేన్.. మీరంటే ఎంతో గౌరవముంది. రాజకీయంగా పార్టీల మధ్య విభేదాలుండొచ్చు కానీ... విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి వ్యాఖ్యలు దేశాన్ని బలహీనం చేస్తాయి. కరోనా వేళ రాజకీయాలొద్దు. కోవిడ్-19పై చేస్తోన్న యుద్ధంలో మనమంతా ఏకమవ్వాలి. ఈ సమయంలో ప్రధానిని నిందించే బదులు... పార్టీలకు అతీతంగా కోవిడ్‌పై పోరాటాన్ని బలోపేతం చేద్దా''మని పేర్కొన్నారు. సోరేన్ వ్యాఖ్యలపై బిజెపి నేతలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.