ఈటెలపై హరీష్ రావు ఫైర్
ఆయనది విఫల ప్రయత్నమే కాదు..వికారమైన ప్రయత్నం కూడా
టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు స్పందించారు. తన సమస్యలకు , తన గొడవకు నైతిక బలం కోసం పదేపదే నా పేరును ప్రస్తావించడం ఈటెల రాజేందర్ భావదారిద్య్రానికి, విజ్ఙత, విచక్షణలేమికి నిదర్శనం. నా భుజాల మీద తుపాకి పెట్టాలనుకోవడం విఫల ప్రయత్నం మాత్రమే కాదు.. వికారమైన ప్రయత్నం కూడా. ఆయన మాటల్లో మనో వికారమే తప్ప సత్యం ఎంత మాత్రం లేదు. నా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీలో తనకే కాకుండా హరీష్ రావు కూడా ఎన్నోసార్లు అవమానాలు జరిగాయంటూ ఈటెల రాజేందర్ మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. దీనికి ఆయన వివరణ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీలో తాను నిబద్దత, విధేయత, క్రమశిక్షణ ఉన్న కార్యకర్తను అని. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు నాకు పార్టీ ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తున్నట్లు హరీష్ రావు తెలిపారు.
పార్టీ కార్యకర్తగా ఉన్న నాకు పార్టీ, నాయకత్వం ఏ పని అప్పగించినా దాన్ని పూర్తిచేయడం నా విధి, బాధ్యత. పార్టీ నాయకుడిగా కేసీఆర్ ఏ ఆదేశం ఇచ్చినా శిరసావహించడం నా కార్తవ్యంగా భావిస్తాను. కేసీఆర్ పార్టీ అధ్యక్షులే కాదు.. నాకు గురువు, నా మార్గదర్శి, నాకు తండ్రితో సమానులు. ఆయన మాట జవదాటకుండా నడుచుకుంటున్నాను. గతంలో అనేకసార్లు ఇదే విషయం సుస్ఫష్టంగా అనేక వేదికలపై చెప్పాను. ఇప్పుడు మరోసారి చెప్తున్న. కంఠంలో ఊపిరిఉన్నంత వరకు ఇలాగే నడుచుకుంటాను. తాచెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్టుగా ఉన్నది ఈటల రాజేందర్ వైఖరి. పార్టీని వీడడానికి ఆయనకు అనేక కారణాలుండొచ్చు. పార్టీలో ఉండాలా.. వెళ్లిపోవాలా అన్నది ఆయన ఇష్టం. ఆయన పార్టీని వీడిన టీఆర్ఎస్ పార్టీకి వీసమెత్తు నష్టం కూడా లేదు. ఆయన పార్టీకి చేసిన సేవకన్నా.. పార్టీ ఆయనకు ఇచ్చిన అవకాశాలే ఎక్కువ అని వ్యాఖ్యానించారు.