కెసీఆర్ సమావేశం జరక్కుండా కుట్ర
హుజూరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసీఆర్ ప్రచారం నిర్వహించకుండా కుట్ర చేశారని మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా సరే కెసీఆర్ పై హజూరాబాద్ ప్రజలకు విశ్వాసం ఉందన్నారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ కే అనుకూలం అని, గెల్లు గెలుపు ఖాయం కావటంతో కొత్త కుట్రలకు శ్రీకారం చుడుతున్నారని విమర్శించారు. 2001 నుంచి ఈ ప్రాంత ప్రజలు కెసీఆర్ ను గెలిపిస్తున్నారన్నారు. వచ్చే రెండున్నరేళ్ళలో ఏమి చేయబోతున్నామో చెప్పామని, మా వాళ్లకు సమాధానం చెప్పకుండా బిజెపి నేతలు పారిపోయారన్నారు. బిజెపి నేతలు మాత్రం అబద్దాలు ప్రచారం చేశారని విమర్శించారు. టీఆర్ఎస్ ఓటుకు 20 వేలు ఇస్తుందని ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత బిజెపికి ఉందా అని మండిపడ్డారు. యూపీలో బిజెపికి చెందిన కేంద్ర మంత్రి కుమారుడు ఒకరు రైతులను కారుతో తొక్కించి వారి చావుకు కారణం అయ్యారన్నారు. అదే టీఆర్ఎస్ పార్టీ రైతులు కారులో వెళ్ళి వ్యవసాయం చేసేందుకు వీలుగా సాయం చేస్తున్నామన్నారు.
దేశంలో ఎక్కడైనా రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఉప ఎన్నికకు బిజెపి మ్యానిఫెస్టో ప్రకటించటం విచిత్రంగా ఉందన్నారు. హుజూరాబాద్ లో హరీష్ రావు ఎందుకు ఉన్నారు..ఇతర మంత్రులు ఎందుకు వస్తున్నారని బిజెపి నాయకులు ప్రశ్నిస్తున్నారని..మరి డిల్లీ నుంచి బిజెపి నేతలు ఎందుకు వచ్చారన్నారు. మీరు వేసిన ప్రశ్నలే మీకు ఎదురవుతాయని తెలియదా? అని ప్రశ్నించారు. గెల్లు శ్రీనివాసయాదవ్ గెలిస్తే హుజూరాబాద్ నియోజకవర్గం డెవలప్ అవుతుందని...అదే ఈటెల రాజేందర్ గెలిస్తే మళ్ళీ మంత్రి కాలేడు..ఏమీ చేయలేడు అన్నారు. గల్లీలో ఉండే గెల్లు శ్రీనివాస్ కావాలో..ప్రతి దానికి ఢిల్లీ వంక చూసే ఈటెల రాజేందర్ కావాలో తేల్చుకోవాలన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏడేళ్లుగా పెట్రోల్, డీజిల్ పై సెస్సు పెంచుతూ పోతున్నారని విమర్శించారు.