మోడీ నుంచి ప్రజలు చాలా నేర్చుకోవాలి
ఈ మాటలు అన్నది ఏ బిజెపి నేతో..లేక ప్రధాని నరేంద్ర మోడీ అభిమానో కాదు. సాక్ష్యాత్తూ కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభలో ఇటీవల వరకూ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా వ్యవహరించిన గులాం నబీ ఆజాద్ కావటంతో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇదే ఆజాద్ రాజ్యసభ సభ్యుడిగా పదవి విరమణ చేస్తున్న సమయంలో ప్రధాని మోడీ సైతం అనూహ్యంగా కన్నీరు పెట్టుకుని మరీ ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఓ వైపు కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ వరసగా ప్రధాని నరేంద్రమోడీపై వరస పెట్టి విమర్శలు గుప్పిస్తుంటే..అందుకు భిన్నంగా అజాద్ పొగడ్తల వర్షం కురిపించటం చర్చనీయాంశంగా మారింది. తాజాగా రాహుల్ మన్ కీ బాత్ అంశంపై స్పందిస్తూ రైతుల సమస్యల గురించి..నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడండి అంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి ట్వీట్ చేశారు.
ఇవేమీ పట్టని ఆజాద్ మోడీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వరస పరిణామాలు చూస్తుంటే ఆజాద్ బిజెపిలో చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనికి బలం చేకూరేలా ఆజాద్ కోసం తమ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని మోడీ ఇటీవల వ్యాఖ్యానించారు కూడా. ఆదివారం జమ్మూలో జరిగిన ఓ కార్యక్రమంలో గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. '' నరేంద్ర మోదీ నుంచి ప్రజలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దేశ ప్రధాని స్థాయికి ఎదిగినా ఆయన తన మూలాలు మర్చిపోలేదు. తననో చాయ్‌వాలాగా గర్వంగా చెప్పుకుంటారు'' అని వ్యాఖ్యానించారు. తనకు, మోదీకి రాజకీయాల పరంగా విభేదాలు ఉన్నప్పటికి, వ్యక్తిగతంగా ఆయన ఉన్నతుడు అన్నారు.