గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామా
బిజెపి కూడా కాంగ్రెస్ లో మోడల్ లోకి వస్తోంది. తరచూ సీఎంలను మారుస్తూ కొత్త సంప్రదాయాలకు తెరలేపుతోంది. ఇటీవలే కర్ణాటకలో సీఎంను మార్చిన బిజెపి ఇప్పుడు గుజరాత్ లోనూ అదే పని చేసినట్లు కన్పిస్తోంది. అయితే గుజరాత్ లో పెద్ద హంగామా లేకుండా అకస్మాత్తుగా ఈ నిర్ణయం జరిగింది. అయితే కర్ణాటకలో మాత్రం కాస్త అందుకు భిన్నంగా జరిగిందనే చెప్పుకోవాలి. కొంత కాలంగా మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై కొంత మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. చివరకు అందరి అభిప్రాయాలు తీసుకుని సీఎంను మార్చారు.
అయితే ఇప్పుడు ప్రధాని మోడీ సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లోను అనుకోకుండా ఈ సీఎం రాజీనామా వ్యవహరం ఒక్కసారిగా సంచలనంగా మారింది. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ సంచలన ప్రకటన చేశారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రటించి షాకిచ్చారు విజయ్ రూపానీ. ఆయన తన రాజీనామా లేఖను శనివారం గవర్నర్‌కి సమర్పించారు విజయ్ రూపానీ. విజయ్ రూపానీ 2016 నుంచి గుజరాత్ సీఎంగా ఉన్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉన్న తరుణంలో విజయ్ రూపానీ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. అయితే ఇది అధిష్టానం ఆదేశాలతో జరిగిందా లేక మరేదైననా కారణాలు అన్న అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.