Telugu Gateway
Politics

గ్రీన్ ల్యాండ్ పై సైనిక ఆపరేషన్ !

గ్రీన్ ల్యాండ్ పై సైనిక ఆపరేషన్ !
X

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ దూకుడికి అడ్డుకట్ట వేసే వాళ్ళు ఎవరూ లేరా?. ఇప్పటికే వెనుజువెలా పై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో ను..ఆయన భార్యను అదుపులోకి తీసుకున్న అమెరికా ఇప్పుడు వరసగా నెక్స్ట్ టార్గెట్స్ పై కన్ను వేస్తోంది. డోనాల్డ్ ట్రంప్ దూకుడు చూస్తుంటే ఈ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గే వాతావరణం ఉన్నట్లు కనిపించటం లేదు. అయితే ట్రంప్ దూకుడు ప్రపంచ వ్యాప్తంగా మరో సారి తీవ్ర అనిశ్చితికి కారణం అయ్యే అవకాశం ఉంది అనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వెనుజువెలా లో టార్గెట్ పూర్తి చేసిన ట్రంప్ ఇప్పుడు తన ఫోకస్ గ్రీన్ ల్యాండ్ పై పెట్టినట్లు కనిపిస్తోంది. రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన పదే పదే గ్రీన్ ల్యాండ్ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు ఈ విషయంలో స్పీడ్ మరింత పెంచారు. గ్రీన్ ల్యాండ్ అమెరికా లో భాగం కావాల్సిందే అని ఇది తమ జాతీయ భద్రతకు ఎంతో ముఖ్యం అంటూ డోనాల్డ్ ట్రంప్ యంత్రాంగం స్పష్టంగా ప్రకటించింది. పేరుకు జాతీయ భధ్రత అని చెపుతున్న కూడా అమెరికా అసలు లక్ష్యం అక్కడ ఉన్న అరుదైన ఖనిజాలతో పాటు ఇతర అంశాలే కీలక అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

గ్రీన్ ల్యాండ్ పై పట్టు సాదించేందుకు తమ దగ్గర ఎన్నో మార్గాలు ఉన్నాయి అని..అవసరం అయితే సైన్యాన్ని వాడే అంశం కూడా ఒకటి అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లివిట్ వెల్లడించారు. ఇటీవల డోనాల్డ్ ట్రంప్ ఇంకో ఇరవై రోజుల్లో గ్రీన్ ల్యాండ్ గురించి మాట్లాడదాం అంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆయన నెక్స్ట్ టార్గెట్ ఇదే అనే చర్చ సాగుతోంది. ఇది ఇలా ఉంటే డోనాల్డ్ ట్రంప్ గ్రీన్ ల్యాండ్ విషయంలో బలవంతపు చర్యలకు దిగితే అది తీవ్రరూపం దాల్చే అవకాశాలు ఉన్నాయని చెపుతున్నారు. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అమెరికా గ్రీన్‌లాండ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని చూస్తే, అది ‘నాటో’ కూటమి అంతానికి దారితీస్తుందని ఇటీవల డెన్మార్క్‌ ప్రధాని మెటె ఫ్రెడెరిక్సన్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఒక సభ్య దేశంపై మరో సభ్య దేశమే దాడికి దిగితే ప్రపంచ భద్రతా వ్యవస్థే కుప్పకూలుతుందని ఆమె హెచ్చరించారు. ‘‘అమెరికా ఒకవేళ నాటోలోని తోటి దేశంపై సైనిక దాడికి దిగితే, అంతటితో అంతా ముగిసినట్లే. రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి మనకు రక్షణగా ఉన్న నాటో కూటమి ఆ క్షణమే కనుమరుగవుతుంది’’ అని ఆమె పేర్కొన్నారు.

గ్రీన్‌లాండ్‌పై ట్రంప్‌ చేస్తున్న వ్యాఖ్యలు ఒక ప్రాంతం గురించి మాత్రమే కాకుండా, అంతర్జాతీయ శాంతి ఒప్పందాలనే ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డెన్మార్క్‌ వాదనకు ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, పోలాండ్‌, స్పెయిన్‌, బ్రిటన్‌ దేశాలు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌, బ్రిటన్‌ ప్రధాని కైర్‌ స్టార్మర్‌ సహా పలువురు ఐరోపా నేతలు మంగళవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేస్తూ.. గ్రీన్‌లాండ్‌ ఎవరి సొత్తు కాదని, అక్కడి ఖనిజ సంపద ఆ భూభాగం ప్రజలకే చెందుతుందని తేల్చి చెప్పారు. గ్రీన్ ల్యాండ్ తో పాటు క్యూబా, మెక్సికో, కొలంబియా లను కూడా తన దారికి తెచ్చుకోవాలని డోనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Next Story
Share it