చంద్రబాబును కలవను

టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కుండబద్దలు కొట్టారు. తాను పార్టీ అధినేత చంద్రబాబును కలవబోనని ప్రకటించారు. పార్టీ నేతలు ఆయనతో సమావేశం అయి..రాజీనామాలాంటి నిర్ణయం వద్దని వారించినా ఆయన ఈ ప్రకటన చేయటం విశేషం. టీడీపీకి బుచ్చయ్య చౌదరి గుడ్ బై చెప్పనున్నట్లు గురువారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. చంద్రబాబు కూడా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. అయినా కూడా బుచ్చయ్య చౌదరి ఎక్కడా మెత్తబడటం లేదు. అసలు పార్టీ నిర్వహణ తీరే సరిగ్గా లేదని ఆయన మండిపడుతున్నారు.
ఈ తరుణంలో బుచ్చయ్య చౌదరితో టీడీపీ సీనియర్ నేతలు చినరాజప్ప, జవహర్‌తో పాటు మరికొంత మంది సమావేశం అయ్యారు. ఈ సమావేశం తర్వాత చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి టీడీపీకి రాజీనామా చేయరని తెలిపారు. తాము చంద్రబాబును కలసి పరిస్థితిని ఆయనకు వివరిస్తామని చెప్పారు. బుచ్చయ్య చౌదరి మాత్రం తన నిర్ణయాన్ని బహిరంగంగానే త్వరలో ప్రకటిస్తానని తెలిపారు.