వైసీపీలో చేరటానికి గంటా కొన్ని ప్రతిపాదనలు పెట్టారు
మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పార్టీ మారే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ అంశాన్ని స్వయంగా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి లేవనెత్తటం విశేషం. గంటా శ్రీనివాసరావు అనుచరుడు, టీడీపీ నేత కాశీ విశ్వనాథ్ బుధవారం నాడు ఆయన సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ వైసీపీలో చేరటానికి గంటా శ్రీనివాసరావు గతంలో కొన్ని ప్రతిపాదనలు పంపించారన్నారు.
వాటిని పార్టీ ఆమోదిస్తే వైసీపీలో చేర్చుకుంటామన్నారు. ఆయన వైసీపీ సర్కార్, జగన్ చేస్తున్న అభివృద్ధిచూసి ఆకర్షితుడయ్యారని తెలిపారు. టీడీపీ నుంచి మరిన్ని వలసలు ఉంటాయన్నారు. వైసీపీలో వ్యక్తిగత నిర్ణయాలు ఉండవన్నారు. కొన్ని నిర్ణయాలు కొంతమందికి నచ్చవచ్చు..నచ్చకపోవచ్చన్నారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇది ఇంకా స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉంది.
రాష్ట్రంలో సుపరిపాలన చూసి కాశీ విశ్వనాథ్ వైఎస్సార్ సీపీలో చేరారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ప్రజలు అధికార పార్టీకి పట్టం కట్టారని, విశాఖ మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ''సంవత్సరం క్రితమే కాశీ పార్టీలో చేరాల్సింది. కొన్ని కారణాలు వలన అవ్వలేదు. జిల్లా వైఎస్సార్‌సీపీ నాయకులందరు కాశిని పార్టిలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. పార్టీని బలోపేతం చేసుకొని జీవిఎంసి ఎన్నికల్లో విజయం సాధించాలి'' అని పేర్కొన్నారు.