Telugu Gateway
Politics

ఈటెల త‌న‌పై తానే దాడి చేయించుకునే ప్లాన్ లో ఉన్నారు

ఈటెల త‌న‌పై తానే దాడి చేయించుకునే ప్లాన్ లో ఉన్నారు
X

హుజూరాబాద్ లో రాజ‌కీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. త‌న‌పై హ‌త్యాప్ర‌య‌త్నం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని మాజీ మంత్రి ఈటెల రాజేంద‌ర్ ఇటీవ‌ల సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ ఘాటుగా స్పందించారు. ఈటెల రాజేంద‌ర్ సొంతగా తన మనుషులతోటే తనపై దాడి చేయించుకుని దాన్ని తమపై వేయడానికి కుట్ర చేస్తున్నారనే సమాచారం ఉంద‌న్నారు. కాబట్టి ఈటెల పాదయాత్రకు బందోబస్తు పెంచడమే కాక అలాంటి కుట్రల్ని అడ్డుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు మంత్రి గంగుల కమలాకర్. ఇప్పటివరకూ తనపై ఎలాంటి నేర చరిత్ర లేదని, తనపై ఆరోపణలు చేసిన ఏ ఒక్కరిపైనా ప్రతీకార చర్యలకు పాల్పడలేదన్నారు. కానీ ఈటెల హుజురాబాద్ లో ఎంతమందిని అణిచివేశాడో, వేదించాడో బహిరంగ రహస్యమేనన్నారు. తెలంగాణలో లేని దాడి, హత్యా సంస్క‌తిని తీసుకొచ్చే ప్రయత్నం ఈటెల చేయడం హేయమన్నారు, కేసీఆర్ ఆధ్వర్యంలో పచ్చగా కలకలలాడుతూ అభివ్రుద్ది, సంక్షేమంలో దూసుకుపోతున్న తెలంగాణలో రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చిచ్చుపెట్టడం దారుణమన్నారు. పదవుల కోసం పెదవులు మూయను అన్న ఈటెల ఓటమి భయంతో అసత్యాలు మాట్లాడుతున్నారన్నారు. పాదయాత్రలో ఉన్న ఈటెలను తన హత్య కోసం ఏ మంత్రి ప్రయత్నిస్తున్నాడో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేయాలని కోరారు మంత్రి గంగుల కమలాకర్.

ఈటెలతో తనకు ఎలాంటి వ్యక్తిగత వైరం లేదని, పార్టీలు వేరు కాబట్టే రాజకీయ పోరాటం మాత్రమే చేస్తానని పునరుద్ఘాటించారు. పెద్దమ్మ తల్లికి దండం పెట్టి కోరుకుంటున్నా ఈటల రాజేందర్ క్షేమంగా ఉండాలని నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. సీఎం కేసీఆర్ పై ఇష్టారీతిన మాట్లాడుతే ఉపేక్షించే ప్రసక్తే లేదన్నారు. కేవలం సానుభూతి కోసం నిరాదార ఆరోపణలు ఈటెల రాజేందర్ చేస్తున్నాడని, తనపై హత్యకు కుట్ర జరుగుతోందంటూ ఈటెలకు రహస్యంగా చెవిలో చెప్పిన మాజీ నక్సలైట్ ఎవరో బయటపెట్టాలని, ఈ కుట్రపై బిజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకొని అమిత్ షాకు పిర్యాదు చేసైనా రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలపై నమ్మకం లేకుంటే కేంద్ర ప్రభుత్వ విచారణ ఎజెన్సీలు వేటితోనైనా, అవసరమైతే సీబీఐతో విచారణ చేసి అత్యంత త్వరలో దోషులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేసారు మంత్రి. ఈ విచారణలో దోషిగా తేలితే రాజకీయాల్ని వదిలేస్తానని, లేదంటే ఈటెల రాజెందర్ క్షమాపణ చెప్పాలని, రాజకీయాల్నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేసారు. మీరు తొందరగా విచారణ చేసి దోషుల్ని తేల్చక పోతే సానుభూతి ఓట్లకోసమే మీరు ఆడుతున్న డ్రామా అని తేలిపోతుందన్నారు.

Next Story
Share it