రిమాండ్ కు తీన్మార్ మల్లన్న
ఓ బెదిరింపు కేసులో అరెస్ట అయిన క్యూ నూస్ చానెల్ వ్యవస్థాపకుడు తీన్మార్ మల్లన్నకు సికింద్రాబాద్ కోర్టు శనివారం నాడు 14 రోజుల రిమాండ్ విధించింది. సికింద్రాబాద్ మధురానగర్ కాలనీలోని మారుతి జ్యోతిష్యాలయం నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంతశర్మ.. తీన్మార్ మల్లన్న తనపై బెదిరింపులకు పాల్పడడ్డాడంటూ ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి మల్లన్నను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం మల్లన్నను సికింద్రాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణలో భాగంగా తీన్మార్ మల్లన్నపై ఐపీసీ సెక్షన్ 306,సెక్షన్ 511 కింద కేసులు పెట్టడంపై అతని తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఫిర్యాదిదారుడు ఎలాంటి సూసైడ్ అటెంప్ట్ చేయలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఏడు రోజులు తమ కస్టడీకి ఇవ్వాలని చిలకలగూడ పోలీసులు కోర్టును కోరారు. ఈ అంశాలన్నింటిని పరిశీలిస్తామని తెలిపిన కోర్టు మల్లన్నకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రస్తుతం మల్లన్నను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇక తీన్మార్ మల్లన్న తరపు న్యాయవాది ఉమేశ్ చంద్ర బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నారు. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కెసీఆర్ పై తీన్మార్ మల్లన్న తన ఛానల్ ద్వారా విమర్శలు చేస్తున్నారు.