గులాబీ నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు
కాంగ్రెస్ అధిష్టానంపై సీనియర్ నేతలు వరస పెట్టి 'ఇంటర్వ్యూ' దాడులు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సీనియర్లు రాసిన లేఖ పెద్ద దుమారమే రేపగా..ఇప్పుడు సీనియర్ నేతలు మీడియాలకు ఇస్తున్న ఇంటర్వ్యూలు అదే తరహా చర్చను లేవనెత్తుతున్నాయి. ఇటీవలే కపిల్ సిబాల్ బీహార్ ఎన్నికల అనంతరం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు గులాం నబీ ఆజాద్ వంతు అయింది. ఓ వైపు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అనారోగ్యంతో డాక్టర్ల సలహా మేరకు ఢిల్లీని వీడి గోవాకు వెళ్ళినట్లు వార్తలు వచ్చిన తరుణంలో తాజాగా గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు మరింత కాకరేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో ఫైవ్ స్టార్ కల్చర్ పెరిగిందని..అది పోతే తప్ప మళ్ళీ పార్టీ అధికారంలోకి రావటం కష్టం అని కుండబద్దలు కొట్టారు. ఓ సారి టిక్కెట్లు..పదవులు దక్కించుకున్న వారంతా వెంటనే స్టార్ హోటళ్ళలో ప్రత్యక్షం అవుతున్నరని అన్నారు.
ప్రజల్లో ఉండి వారి సమస్యలు పట్టించుకుంటే తప్ప...పార్టీకి పునర్జీవం రావటం కష్టం అన్నారు. ప్రజా సమస్యలపై ఏమాత్రం పోరాటం చేయకుండా కేవలం ప్రెస్‌నోట్ విడుదల చేయగానే ఇక తమ పని పూర్తి అయిందనే భ్రమలో ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితి పోయే వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టం. ఈ తీరు వెంటనే మార్చుకోవాలి. జాతీయ నాయకత్వం కిందిస్థాయి నేతలకు ఆదర్శంగా ఉండాలి. గతంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో పార్టీ చాలా క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు తాను బాధ్యుడిగా ఉంటూ పార్టీని పటిష్టస్థితికి చేర్చగలిగాను. ఆ మూడు రాష్ట్రాల్లో అధికారంలోకి తీసుకురాగలిగాను. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం రావాలంటే నేతలు ఏసీ రూములు వదిలి ప్రజల్లోకి వెళ్లాలి. లేకపోతే ఎప్పటికీ అధికారంలోకి రాలేము' అని అన్నారు.