Telugu Gateway
Politics

ఆయన ఎప్పుడూ అంతే

ఆయన ఎప్పుడూ అంతే
X

విపక్షాలపై విమర్శలు చేయటానికి మాత్రం ఏ మాత్రం ఆలశ్యం చేయరు. అదే ప్రభుత్వం ఇరకాటంలో పడే పరిస్థితి వస్తే మాత్రం పదే పదే అదే మోడల్ ఫాలో అవుతూ వస్తున్నారు ప్రధాని మోడీ. దేశాన్ని షాక్ కు గురిచేసిన ఘటనపై ఎట్టకేలకు ప్రధాని మోడీ మాట్లాడారు. అది కూడా ఒక ఇంటర్వ్యూ లో మాత్రమే. నాలుగు రోజుల క్రితం పార్లమెంట్ లో జరిగిన భద్రతా ఉల్లంఘనపై అయన స్పందించారు. ఎంతో సంచలనం సృష్టించిన ఈ ఘటనపై ప్రధాని మోడీ స్పందించటానికి ఇన్ని రోజుల సమయం తీసుకోవటం పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశాన్ని కుదిపేసిన ఈ ఘటనపై ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లు స్పందించాలని విపక్షాలు అన్నీ కోరినా కూడా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. ఈ అంశంపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా మాత్రమే మాట్లాడారు. భద్రతా వైఫల్యంపై విచారణకు ఆదేశించారు. మోడీ తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పార్లమెంట్ లో జరిగింది చాలా తీవ్రమైన అంశం అన్నారు. ఈ ఘటన దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై అనవసర రాద్ధాంతం చేయవద్దు అని విపక్షాలను కోరారు మోడీ. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం వెతకాలి అన్నారు. విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని నమ్ముతున్నట్లు తెలిపారు.

పార్లమెంట్ లో జరిగిన భద్రతా ఉల్లంఘన తర్వాత మంత్రులతో ప్రధాని మోడీ ఉన్నత స్థాయి సమావేశం అయితే పెట్టారు కానీ..అయన మాత్రం మాట్లాడలేదు. పార్లమెంట్ పై దాడి తరహా ఘటన అంటే అది మాములు విషయం కాదు..కానీ ప్రధాని మోడీ మాత్రం నాలుగు రోజుల తర్వాత ఇంతటి కీలక విషయంపై స్పందిచటంపై విస్మయం వ్యక్తం అవుతోంది. అదే కాంగ్రెస్ ఎంపీ దగ్గర దొరికిన వందల కోట్ల రూపాయల నల్లధనంపై మాత్రం ట్వీట్ చేశారు..విమర్శలు గుప్పించారు. దీన్ని తప్పు అని ఎవరూ అనరు ...కానీ కొంతమంది వ్యక్తులు ఏకంగా పార్లమెంట్ లోకి దూకి సభలో పొగ బాంబులు విసిరిన అంశంపై మాత్రం మోడీ తాపీగా స్పందించటం ఏ మాత్రం సరి కాదు అనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండి ఉంటే బీజేపీ రియాక్షన్ ఇలాగే ఉండేదా అన్న చర్చ కూడా సాగుతోంది. గత పదేళ్లుగా మోడీ సర్కారు ఇరకాటంలో పడే అంశాలు ఏవి తెరపైకి వచ్చినా కూడా ఇదే మోడల్ ను ఫాలో అవుతూ వస్తోంది. ప్రతిపక్షాలు ఎంత ఆందోళన చేసినా సమాధానం చెప్పక పోగా బుల్డోజ్ చేసుకుంటూ సాగుతోంది. ఒక్క పార్లమెంట్ ఘటన విషయంలోనే కాదు...అదానీ ఎపిసోడ్, మణిపూర్ ఘర్షణల విషయంలోనూ ప్రధాని మోడీ స్పందన ఇలాగే ఉన్న విషయం తెలిసిందే.

Next Story
Share it