Telugu Gateway
Politics

వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల ర‌ద్దు...రైతు కోణం కంటే రాజ‌కీయ కోణ‌మే ఎక్కువ‌!

వ్య‌వ‌సాయ‌ చ‌ట్టాల ర‌ద్దు...రైతు కోణం కంటే రాజ‌కీయ కోణ‌మే ఎక్కువ‌!
X

మోడీ ఎందుకు రివ‌ర్స్ గేర్ వేశారు?!

రైతుల ఉద్య‌మం పీక్ లో ఉన్న‌ప్పుడు కూడా ప్ర‌ధాని మోడీ స‌సేమిరా అన్నారు. కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ కూడా ప‌లుమార్లు రైతుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి...చ‌ట్టాల విష‌యంలో వెన‌క్కి త‌గ్గేదే లేద‌న్నారు. రైతుల‌కు ఏమైనా అభ్యంత‌రాలు ఉంటే వాటి గురించి చ‌ర్చిస్తాం కానీ..చ‌ట్టాలు పూర్తిగా ర‌ద్దు చేయాలంటే కుద‌ర‌ద‌న్నారు. రైతు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకించి వారంద‌రినీ ప్ర‌గ‌తి నిరోధ‌కులుగా పేర్కొంటూ వ‌చ్చారు. కానీ అనూహ్యంగా శుక్ర‌వారం ఉద‌యం ప్రధాని మోడీ దేశ ప్ర‌జ‌ల ముందుకు వ‌చ్చి గురునాన‌క్ జ‌యంతి రోజున రైతు చ‌ట్టాల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌ట‌మే కాకుండా..రైతులంద‌రికీ క్షమాప‌ణ చెబుతున్న‌ట్లు ప్ర‌కటించ‌టం దేశంలో పెద్ద సంచ‌ల‌నంగా మారింది. దీనిపై ర‌కాల విశ్లేష‌ణ‌లు వెలువ‌డుతున్నాయి. ఇది రైతుల కోణంలో కంటే రాజ‌కీయ కోణంలో తీసుకున్న నిర్ణ‌యంగా ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. రైతు చ‌ట్టాల‌పై సూచ‌న‌లు చేసేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన నిపుణుల క‌మిటీలోని స‌భ్యుడు ఇదే అంశాన్ని ప్ర‌స్తావించ‌టం అత్యంత కీల‌కంగా మారింది. అంతే కాదు ప్ర‌భుత్వం నిర్ణ‌యం ఏ మాత్రం స‌రికాద‌ని అనిల్ జె ఘ‌న్వాత్ అభిప్రాయ‌ప‌డ్డారు. చ‌ట్టాల ర‌ద్దు బ‌దులు ప్ర‌త్యామ్నాయాల‌ను ప‌రిశీలించి ఉండాల్సింద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌నున్న అత్యంత కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్, పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోణంలోనే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే ఈ చ‌ట్టాల‌పై గ‌తంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్య‌ల ట్వీట్, వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. 2021, జనవరి 14న రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ''నా మాటలు గుర్తు పెట్టుకోండి.. వ్యవసాయ వ్యతిరేక చట్టాలను ప్రభుత్వం తప్పక వెనక్కి తీసుకుంటుంది'' అన్నారు. సాగు చట్టాల రద్దుపై రాహుల్‌ గాంధీ స్పందించారు. ''అన్నదాతలు తమ స్యతాగ్రహంతో కేంద్రం అహంకారాన్ని దించారు. అన్యాయంపై సాధించిన ఈ విజయానికి రైతులందరికీ అభినందనలు'' అంటూ ట్వీట్‌ చేశారు. 'సాగు చట్టాల రద్దుపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఈ ప్రకాశ్‌ దివాస్‌ నాడు శుభవార్త విన్నాం. రైతులకు వ్యతిరేకంగా ఉన్న సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రకటించింది. ఈ ఉద్యమంలో 700మందికి పైగా రైతులు ప్రాణత్యాగం చేశారు. వారి త్యాగాలకు నేడు తగిన ఫలితం లభించింది. దేశ రైతులకు సెల్యూట్‌'' అంటూ కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు. ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ సైతం క్రూర‌త్వానికి చ‌లించ‌కుండా అలుపెర‌గ‌ని పోరాటం చేసిన రైతుల‌కు అబినంద‌న‌లు అన్నారు. ఇది రైతుల విజ‌యం అన్నారు.

Next Story
Share it