Telugu Gateway
Politics

బిజెపిలో చేరిన విఠ‌ల్

బిజెపిలో చేరిన విఠ‌ల్
X

తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (టీఎస్ పీఎస్ సీ) మాజీ స‌భ్యుడు, తెలంగాణ ఉద్య‌మం స‌మ‌యంలో క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన సీహెచ్ విఠ‌ల్ సోమ‌వారం నాడు బిజెపిలో చేరారు. న్యూఢిల్లీలో ఆయ‌న కేంద్ర మంత్రి ముక్తార్ అబ్సాస్ నఖ్వీ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ విఠల్ బీజేపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నానన్నారు. ఉద్యమకారులపై సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా ఈ చేరికలు జరుగుతున్నాయన్నారు. ఉద్యమ ద్రోహులకు టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు తెలంగాణలో బీజేపీ చేస్తున్న పోరాటానికి కలసిరావాలని పిలుపునిచ్చారు.

తీన్మార్ మల్లన్న మంగళవారం బీజేపీలో చేర‌తారని బండిసంజయ్ వెల్ల‌డించారు.విఠల్ మాట్లాడుతూ ఈ రోజు త‌న జీవితంలో మరపురానిరోజని, అంబేద్కర్ జయంతి, రామమందిర నిర్మాణం కోసం కరసేవకులు బలిదానం చేసిన రోజున సొంత ఇల్లు బీజేపీకి రావడం సంతోషంగా ఉందన్నారు. రెండు లక్షల ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీగా ఉన్నా.. ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయడంలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకారులకు, మహిళలు, విద్యావంతులకు సరియైన గౌరవం లేదన్నారు. ఏడేళ్ళలో 600 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. 2023లో తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తుందని విఠల్ ధీమా వ్య‌క్తం చేశారు.

Next Story
Share it