Telugu Gateway
Politics

రాహుల్...రఘురామరాజన్ కలిసి నడిచారు

రాహుల్...రఘురామరాజన్ కలిసి నడిచారు
X

భారత్ జోడో యాత్రలో కీలక పరిణామం. రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్ బిఐ ) మాజీ గవర్నర్ రఘురామరాజన్ బుధవారం నాడు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు. వీళ్లిద్దరు నడుచుకుంటూనే పలు విషయాలు చర్చించారు. ప్రస్తుతం ఈ యాత్ర రాజస్థాన్ లో సాగుతున్న విషయం తెలిసిందే. రఘురామరాజన్ పలు సందర్బాల్లో కేంద్రంలోని మోడీ సర్కారు ఆర్థిక విధానాలను తప్పు పట్టారు. ముఖ్యంగా నోట్ల రద్దు కారణంగా దీర్ఘకాలంలో దుష్పరిణామాలు ఉంటాయని అయన అప్పట్లోనే హెచ్చరించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు కూడా. రాహుల్ గాంధీ తో కలిసి రఘురామరాజన్ ఈ యాత్రలో పాల్గొనటం ఇప్పుడు కీలక పరిణామంగా భావిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన నిపుణులు రాహుల్ యాత్రలో భాగస్వాములు అవుతున్నారు.

వీళ్ళ దగ్గర నుంచి రాహుల్ పలు విషయాలు తెలుసుకొని తర్వాత రాహుల్ వీటిపై స్పందిస్తున్నారు. యాత్ర పూర్తి అయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీకి కొత్త జోష్ వస్తుంది అనే అభిప్రాయంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. అయితే గుజరాత్ అసెంబ్లీ ఫలితాలు మాత్రం కాంగ్రెస్ ను తీవ్ర నిరాశకు గురి చేసేవే. సెప్టెంబరు 7వతేదీన కన్యాకుమారి నుంచి ప్రారంభమైన రాహుల్ యాత్ర ఇప్పటి వరకు తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో సాగింది. ఈ యాత్ర ఫిబ్రవరి 2023వ సంవత్సరం ప్రారంభంలో జమ్మూ కశ్మీర్‌లో ముగియనుంది.భారత్ జోడో యాత్రలో ఇప్పటి వరకు పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, కార్యకర్తలు, మాజీ అధికారులు పాల్గొన్నారు.భారత్ జోడో యాత్ర 100 రోజులు పురస్కరించుకుని కాంగ్రెస్ శుక్రవారం జైపూర్‌లో సింగర్ సునిధి చౌహాన్ లైవ్ పర్ఫార్మెన్స్‌తో కచేరీ నిర్వహించనుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ తెలిపారు.

Next Story
Share it