బిజెపిలో చేరిన మాజీ మంత్రి
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలిన తహతహలాడుతున్న బిజెపి ఆ దిశగా అడుగులు వేస్తోంది. అధికార టీఆర్ఎస్ పై విమర్శల దూకుడు పెంచటంతోపాటు.. గతంలో కీలక నేతలుగా ఉన్న వారిని పార్టీలోకి ఆహ్వానిస్తోంది. అందులో భాగంగానే తాజాగా మాజీ మంత్రి, సీనియర్ నేత ఏ. చంద్రశేఖర్ ను పార్టీలో చేర్చుకున్నారు. వికారాబాద్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఈ సందర్భంగా చంద్రశేఖర్ కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు కేసీఆర్ ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వలేదని, మోడీ ప్రభుత్వమే నిధులు మంజూరు చేసిందని తెలిపారు.
సర్పంచ్‌ని కలెక్టర్ సస్పెండ్ చేసే జీవో తెచ్చిన కేసీఆర్..సీఎంను కూడా సీఎస్ సస్పెండ్ చేసే జీవో తేవాలని డిమాండ్ చేశారు. వికారాబాద్‌ని హైదరాబాద్ జోన్‌లో కలపాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలను అమలు చేయటంలో సీఎం కెసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. వికారాబాద్ కు వైద్య కళాశాల తీసుకురావాలన్న హామీని బిజెపి ద్వారా నెరవేరుస్తామని తెలిపారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ప్రతి ఒక్క హిందువు పది రూపాయల అయినా విరాళం ఇవ్వాలని కోరారు.